ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన ఒక భారతీయుడు ఇప్పుడు రష్యాలో కార్మికుల కొరత మధ్య వీధులను శుభ్రం చేస్తున్నాడు. అంతేకాదు నెలకు దాదాపు రూ.లక్ష సంపాదిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే..రష్యా తీవ్రమైన కార్మికుల కొరతను ఎదుర్కొంటుంది. ఈ తరుణంలో భారతీయ వలసదారుల బృందం ఒకటి రష్యాలో వీధులను శుభ్రపరిచే పనిని చేపట్టింది. నాలుగు నెలల క్రితం రష్యాకు చేరుకున్న 17 మంది భారతీయులలో 26 ఏళ్ల ముఖేష్ మండల్ కూడా ఉన్నాడు. అతను గతంలో సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేశాడని చెప్పాడు.
మండల్ ఇటీవల రష్యన్ మీడియా సంస్థ ఫోంటంకాతో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వీధి శుభ్రపరిచే వ్యక్తిగా తన ప్రస్తుత ఉద్యోగం గురించి మాట్లాడారు. గత కొన్ని వారాలుగా, అతను మరియు ఇతర భారతీయ కార్మికులు రోడ్డు నిర్వహణ సంస్థ కొలోమియాజ్స్కోయ్ ఉపాధి కింద నగర రోడ్లను శుభ్రం చేస్తున్నారు. కొలోమియాజ్స్కోయ్ భారతదేశం నుండి వచ్చిన 17 మంది కార్మికుల రాకకు సౌకర్యాలు కల్పించింది. వారి ఆహారం, వసతిని కూడా ఏర్పాటు చేసింది. అయితే ప్రతి కార్మికుడు దాదాపు 100,000 రూబిళ్లు, అంటే దాదాపు రూ. 1.1 లక్షలు సంపాదిస్తున్నట్లు సమాచారం.