నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా

యెమెన్‌లో కేరళకు చెందిన భారతీయ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా పడింది.

By Medi Samrat
Published on : 15 July 2025 4:36 PM IST

నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా

యెమెన్‌లో కేరళకు చెందిన భారతీయ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష వాయిదా పడింది. నిమిషా ప్రియ తన వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహదీని హత్య చేసినందుకు జూలై 16న ఉరి తీయాల్సి ఉంది. కేరళకు చెందిన ప్రభావవంతమైన సున్నీ ముస్లిం నాయకుడు కాంతపురం AP అబూబకర్ ముసలియార్ మరియు భారత ప్రభుత్వం జోక్యంతో చర్చల తర్వాత స్థానిక యెమెన్ అధికారులు నిమిషా శిక్షను వాయిదా వేశారు.

ఇటీవలి కాలంలో, ఇతర పక్షంతో పరస్పర అంగీకారయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనడానికి.. నిమిషా ప్రియ కుటుంబానికి మరింత సమయం ఇవ్వడానికి భారత ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేసింది. భారతీయ అధికారులు యెమెన్ జైలు అధికారులు మరియు ప్రాసిక్యూటర్ కార్యాలయంతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నారు.

నిమిషా ప్రియా తన యెమెన్ వ్యాపార భాగస్వామి తలాల్ అబ్దో మహదీని 2017 సంవత్సరంలో హత్య చేసినట్లు ఆరోపించబడింది. ఈ కేసులో ఆమెకు 2020లో మరణశిక్ష విధించబడింది. ఆమె చివరి అప్పీల్ 2023లో తిరస్కరించబడింది. ఆమె ఉరితీత తేదీని జూలై 16, 2025గా నిర్ణయించారు. ప్రస్తుతం నిమిషా యెమెన్ రాజధాని సనా జైలులో ఉన్నారు.

తాజాగా నిమిషా మరణశిక్షను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. సుప్రీం కోర్టులో ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ (AGI) ప్రియాకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని చెప్పారు. చర్చలు కొనసాగే వరకు డెత్ ఆర్డర్‌ను నిలిపివేయాలని ప్రియా కేసును నిర్వహిస్తున్న ప్రభుత్వ న్యాయవాదితో సహా యెమెన్ అధికారులతో చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

ఈ విషయంలో ప్రభుత్వంతో పాటు కేరళకు చెందిన ప్రభావవంతమైన సున్నీ ముస్లిం నాయకుడు కంఠపురం ఏపీ అబూబకర్ ముసలియార్ కూడా యెమెన్‌లో చర్చలు ప్రారంభించారు. ముస్లియార్ ద్వారా యెమెన్‌లోని ప్రముఖ సూఫీ పండితుడు షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ప్రతినిధి, మరణించిన తలాల్ అబ్దో మహదీ కుటుంబం మధ్య చర్చలు జరిగాయి. అలాగే.. చర్చలు జరుగుతున్నప్పుడు నిమిషా ప్రియ ఉరిని వాయిదా వేయాలని ముసలియార్ యెమెన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

యెమెన్‌లో వర్తించే షరియా చట్టం ప్రకారం.. హత్య కేసుల్లో బ్లడ్ మనీ (పరిహారం) ఎంపిక ఉంది. ఇందులో నిందితుడి కుటుంబీకులు మృతుడి కుటుంబానికి ఆర్థిక నష్టపరిహారం చెల్లించాలి. మృతుడి కుటుంబం ఈ నష్టపరిహారాన్ని అంగీకరిస్తే మరణశిక్ష నుంచి తప్పించుకోవచ్చు. మరణించిన తలాల్ కుటుంబాన్ని సంప్రదించడం ఇప్పటి వరకు అసాధ్యమ‌వ‌గా.. ఇప్పుడు చ‌ర్చ‌ల దిశ‌గా ప‌రిస్థితి మారింది. మరణించినవారి కుటుంబానికి చెందిన సన్నిహిత సభ్యుడు హొడైదా స్టేట్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి, యెమెన్ షూరా కౌన్సిల్ సభ్యుడు చర్చలలో పాల్గొన‌డం విశేషం.

Next Story