ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం : భార‌తీయులారా.. వెంట‌నే కీవ్‌ను వీడండి

Indian nationals asked to leave Kyiv immediately in new advisory.ఉక్రెయిన్‌పై ర‌ష్యా ప్రారంభించిన యుద్దం ఆరో రోజుకు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 March 2022 7:33 AM GMT
ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం : భార‌తీయులారా.. వెంట‌నే కీవ్‌ను వీడండి

ఉక్రెయిన్‌పై ర‌ష్యా ప్రారంభించిన యుద్దం ఆరో రోజుకు చేరుకుంది. యుద్దం వ‌ద్ద‌ని చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకోవాల‌ని ప్ర‌పంచ దేశాలు ఎంత చెబుతున్న‌ప్ప‌టికి ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ మాత్రం వాటిని పెడ‌చెవిన పెడుతున్నాడు. ఈ క్ర‌మంలో అన్ని దేశాలు ర‌ష్యాని ఒంటరిని చేసే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ప్ప‌టికీ పుతిన్ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు స‌రిక‌దా మ‌రింత దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ రాజ‌ధాని ని స్వాధీనం చేసుకునేందుకు ర‌ష్యా సైన్యం వేగంగా ముందుకు క‌దులుతోంది. 64 కి.మీ పొడ‌వైన ఓ భారీ ర‌ష్య‌న్ కాన్వాయ్ కీవ్ వైపు వెలుతున్న‌ట్లు శాటిలైట్ చిత్రాలు వెల్ల‌డించాయి.

దీంతో.. ఏ క్ష‌ణంలోనైనా కీవ్‌పై ర‌ష్యా బ‌ల‌గాలు విరుచుకుప‌డే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం మ‌రింత అప్ర‌మ‌త్తమైంది. కీల‌క ఆదేశాలు జారీ చేసింది. కీవ్ న‌గ‌రంలో ఉన్న భార‌తీయ విద్యార్థులు, పౌరులు వెంట‌నే న‌గ‌రాన్ని విడిచి వెళ్లాల‌ని సూచించింది. మెట్రో రైళ్ల‌తో పాటు అందుబాటులో ఉన్న మిగిలిన ర‌వాణా మార్గాల ద్వారా కీవ్ న‌గ‌రం నుంచి బ‌య‌ల‌కు వెళ్లాల‌ని ఉక్రెయిన్ లోని భార‌త రాయ‌బార కార్యాల‌యం ఆదేశాలు జారీ చేసింది.

ఇక.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భార‌తీయుల‌ను త‌ర‌లించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ గంగాను చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చాలా మంది విద్యార్థుల‌ను స్వ‌దేశం తీసుకువ‌చ్చారు. ఇప్పుడు ఆప‌రేష‌న్ గంగాకు వాయుసేన కూడా తోడుకానుంది. త‌ర‌లింపు ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసేందుకు వాయుసేన కూడా ఆప‌రేష‌న్‌లో భాగం కావాల‌ని ప్ర‌ధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు. ఆప‌రేష‌న్ గంగా కోసం వాయుసేన‌కు చెందిన సీ-17 గ్లోబ్ మాస్ట‌ర్ విమానాన్ని వాడ‌నున్నారు. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మందిని తీసుకువ‌చ్చేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Next Story