ఆ దేశంలోని భారతీయులు జాగ్రత్తగా ఉండాలి
లండన్‌లోని భారత హైకమిషన్.. యూకే లోని భారత పౌరులకు కీలక సలహాను జారీ చేసింది.
By Medi Samrat Published on 6 Aug 2024 9:45 PM ISTలండన్‌లోని భారత హైకమిషన్.. యూకే లోని భారత పౌరులకు కీలక సలహాను జారీ చేసింది. వలసదారులు, ఆ దేశంలో ఆశ్రయం కోరేవారిని లక్ష్యంగా చేసుకుని కొనసాగుతున్న హింసాత్మక ఘర్షణల కారణంగా భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు. హైకమిషన్ సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా ఈ సలహాను జారీ చేశారు. గత వారంలో UKలోని కొన్ని ప్రాంతాలలో చోటు చేసుకున్న వరుస దాడుల కారణంగా భారతీయ పౌరులు, ఇతర వలస సంఘాల భద్రత గురించి ఆందోళనలను పెంచుతుంది.
UKలోని భారతీయ పౌరులు నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. స్థానిక వార్తలు, అధికారిక భద్రతా సలహాలను అనుసరించాలని తెలిపారు. తక్షణ సహాయం అవసరమైన వారు +44-2078369147 నెంబర్ ను, inf.london@mea.gov.in మెయిల్ కు సంప్రదించాలని కోరింది. UK లోని బర్మింగ్‌హామ్, ప్లైమౌత్ వంటి నగరాల్లో ఘర్షణలు చోటు చేసుకున్నాయి. బ్రిటీష్ ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దటానికి చర్యలు తీసుకుంటోంది. నిరసనలను ప్రధానమంత్రి స్టార్మర్ తీవ్రంగా ఖండించారు. నిరసనకారులకి శిక్షలు తప్పవని ప్రధాని హెచ్చరించారు.