నీరా టాండన్.. మరో భారతీయ అమెరికన్ కు బైడెన్ కీలక పదవి
Indian-American Neera Tanden To Serve As Senior Adviser To Biden. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవి చేపట్టిన తర్వాత ఎంతో మంది భారతీయ
By Medi Samrat Published on 15 May 2021 5:41 PM IST
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవి చేపట్టిన తర్వాత ఎంతో మంది భారతీయ అమెరికన్లను కీలక పదవుల్లో ఉంచారు. తాజాగా మరో భారతీయ అమెరికన్ నీరా టాండన్ కు జో బైడెన్ మంచి పదవిని ఇచ్చారు. శ్వేతసౌధంలో బైడెన్ సీనియర్ సలహాదారుగా భారతీయ మూలాలున్న నీరా టాండన్‌ను నియమించారు. ఇంతకు ముందు ఆమెను వైట్‌హౌస్‌లో బడ్జెట్ చీఫ్‌గా నియామించాలని అనుకోగా.. రిపబ్లికన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. బడ్జెట్ చీఫ్‌గా నీరా టాండన్ నియామకంపై సెనెట్‌తో పాటు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో అధ్యక్షుడు బైడెన తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన బైడెన్‌కు ఇది తొలి కేబినెట్ వైఫల్యంగా నిలిచింది. ఇప్పుడు ఆమెను సీనియర్ సలహదారుగా బైడెన్ నియమించారు. దీనికి సెనెట్ ఆమోదం తెలపాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఆమె హెల్త్‌కేర్, ఇంటర్నెట్ యాక్సెస్ అంశాలపై ఆమె దృష్టిసారించనున్నారని వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు. సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ (సీఏపీ) అధ్యక్షురాలిగా పనిచేస్తున్న టాండన్.. గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌కు సలహాదారుగా కూడా వ్యవహరించారు.
నీరా గతంలో డెమొక్రాటిక్ నేతలతో సహా పలువురు చట్టసభ్యులను విమర్శిస్తూ ట్వీట్లు చేశారు. అవి వివాదాస్పదమమయ్యాయి. ఇటీవల నీరా టాండన్‌ను వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా నియమించాలని బైడెన్ నిర్ణయించుకున్నప్పుడు ఆమె గతంలో చేసిన ట్వీట్లు వెంటాడాయి. ఆ పదవి రాకుండా అడ్డుపడ్డాయి. ఆమె నియామకాన్ని మంత్రులు, డెమొక్రాటిక్ చట్టసభ్యులు వ్యతిరేకించారు.
ఆమెవిజయాలపై తనకు చాలా గౌరవం ఉందని, త్వరలోనే ఆమెకు తన యంత్రాంగంలో మరో పదవిలోకి తీసుకొనే అవకాశాలన్ని పరిశీలిస్తున్నామని బైడెన్ గతంలోనే చెప్పగా.. చెప్పిన మాటనును తాజాగా నిలబెట్టుకున్నారు. బైడెన్ సీనియర్ సలహాదారుగా నీరా టాండన్ నియామకంపై సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ (సీపీసీ) హర్షం వ్యక్తం చేసింది.