దుష్ప్రచారంలో మనమే టాప్..!
India world’s top source of misinfo on Covid-19. కరోనా మహమ్మారి మొదలైన రోజుల్లో ఏది పడితే అది షేర్ చేస్తూ ఉండేవారు.
By Medi Samrat Published on 16 Sep 2021 5:59 AM GMTకరోనా మహమ్మారి మొదలైన రోజుల్లో ఏది పడితే అది షేర్ చేస్తూ ఉండేవారు. అది తింటే మహమ్మారి తగ్గిపోతుందని.. ఇది తాగితే మహమ్మారి నశిస్తుందని.. ఆయన మందు కనిపెట్టాడు.. ఈయన కనిపెట్టాడు అంటూ ప్రచారం చేస్తూ వచ్చేవారు. ఇంకా అది కొనసాగుతూనే ఉంది. అయితే కొవిడ్-19కు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచార వ్యాప్తికి కేంద్రంగా ఉన్న దేశాల్లో భారత్ మొదటిస్థానంలో ఉన్నదని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. కరోనా దుష్ప్రచారానికి సంబంధించి 138 దేశాల ద్వారా ప్రసారమైన 9,657 పోస్టులను పరిశీలించగా వాటిలో అత్యధికంగా 18.07 శాతం పోస్టులు భారత్ కేంద్రంగా పుట్టుకొచ్చినట్టు వివరించింది. దేశంలో ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగం విపరీతంగా పెరిగిపోవడం, ప్రజల్లో ఇంటర్నెట్ అక్షరాస్యత కొరవడటం దీనికి కారణంగా తెలిపింది. తప్పుడు సమాచారం వల్ల ఎక్కువగా ప్రభావితమైన దేశాల్లోనూ భారత్ తొలి స్థానంలో ఉన్నట్టు తెలిపింది.
కరోనా అసత్య సమాచారన్ని ప్రచారం చేసిన దేశాల్లో భారత్ (18.07శాతం), అమెరికా (9.74 శాతం), బ్రెజిల్ (8.57 శాతం), స్పెయిన్ (8.03) టాప్–4లో ఉన్నాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఇందులో సోషల్ మీడియాలో (84.94 శాతం), ఇంటర్నెట్‌లో (90.5 శాతం) అసత్య సమాచారాలు పోస్ట్ అయ్యాయని తెలిపింది. అన్నింటికి మించి ఒక్క ఫేస్‌బుక్‌లోనే (66.87) శాతం అసత్య సమాచారం ప్రచురితమైందని పరిశోధన తేల్చింది. ఈ విషయం సేజెస్ ఇంటర్నేషన్ ఫెడరేషన్ ఆఫ లైబ్రరీ అసోసియేషన్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది.