అఫ్గానిస్థాన్‌కు భారత్ సాయం.. మొదట మనమే..!
India Vows To Help Afghanistan After Deadly Earthquake. సాయం చేయడంలో భారతీయులు ముందు ఉంటారని మరోసారి నిరూపించారు.
By Medi Samrat Published on 24 Jun 2022 11:43 AM GMT
సాయం చేయడంలో భారతీయులు ముందు ఉంటారని మరోసారి నిరూపించారు. భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన అఫ్గానిస్థాన్‌కు సాయం చేసేందుకు భారత్ ముందుకు వచ్చింది. "భూకంప బాధితులకు, వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్లు భారత్ కూడా ప్రకటించింది. అఫ్గానిస్థాన్ ప్రజలకు సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది" అని ఐక్యరాజ్య సమితిలోని భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి చెప్పారు. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరీందం బాగ్చీ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. ఇప్పటికే అఫ్గాన్‌కు సాయంగా భారత్ నుంచి సరుకులు పంపామని, అవి కాబూల్ చేరుకున్నాయని తెలిపారు. మిగతా సాయం కూడా త్వరలోనే అందుతుదని తెలిపారు.
అఫ్గాన్‌లో ఇటీవల సంభవించిన భూకంపం వల్ల 1,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆకలితో అలమటిస్తున్న ఆఫ్గన్లకు ఇప్పటికే భారత దేశం తన వంతు సాయంగా గోధుమలను పంపించింది. ఆహారం, అత్యవసర మందులు, ఇతర పరికరాలు, సహాయ సామగ్రితో కూడిన విమానాలు గురువారం.. రాత్రే ఆ దేశ రాజధాని కాబూల్ కు చేరుకోగా.. ఈ రోజు ఉదయం మరో విమానంలో మరింత సహాయ సామగ్రిని తరలించారు. పలువురు సాంకేతిక, వైద్య నిపుణులతో కూడిన బృందం కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లింది.