ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్‌కు బ్రేక్..కారణమిదే!

అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ట్రంప్ సరికొత్త టారిఫ్ ప్రకటనల నేపథ్యంలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కీలక మలుపు తిరిగింది

By -  Knakam Karthik
Published on : 22 Feb 2026 5:30 PM IST

International News, India, US Trade Deal, India-US Talks,  New Tariff, Trump

ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్‌కు బ్రేక్..కారణమిదే!

అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ట్రంప్ సరికొత్త టారిఫ్ ప్రకటనల నేపథ్యంలో భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కీలక మలుపు తిరిగింది. భారత్, అమెరికా దేశాల మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు భారత ప్రధాన చర్చల బృందం రేపటి నుంచి (ఫిబ్రవరి 23, 2026) వాషింగ్టన్‌లో మూడు రోజుల పాటు చర్చలు జరపాల్సి ఉంది. అయితే, అమెరికా సుప్రీంకోర్టు డొనాల్డ్ ట్రంప్ గతంలో విధించిన భారీ టారిఫ్‌లను చట్టవిరుద్ధమని కొట్టివేస్తూ తీర్పునివ్వడంతో, మారిన పరిస్థితులపై లోతైన అధ్యయనం చేసేందుకు ఇరు దేశాలు ఈ చర్చలను వాయిదా వేశాయి.

డొనాల్డ్ ట్రంప్ అత్యవసర అధికారాలను (IEEPA) వాడుతూ విదేశీ వస్తువులపై విధించిన టారిఫ్‌లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. పన్నులు విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది.కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. 'సెక్షన్ 122' అనే మరో చట్టాన్ని ఉపయోగించి, ఫిబ్రవరి 24 నుంచి 150 రోజుల పాటు అన్ని దేశాల దిగుమతులపై 15% గ్లోబల్ టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటించారు.

భారత్‌పై ప్రభావం:

అంతకుముందు కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్‌పై టారిఫ్ 18% ఉండాలి. కానీ ఇప్పుడు ట్రంప్ ప్రకటించిన కొత్త టారిఫ్ 15% మాత్రమే. దీనివల్ల గతంలో కుదుర్చుకున్న 18% ఒప్పందం కంటే ప్రస్తుత 15% టారిఫ్ భారత్‌కు కొంత మేలు చేసేలా ఉంది. ఒప్పందం ప్రకారం 18% చెల్లించాలా? లేక కొత్తగా ప్రకటించిన 15% చెల్లించాలా? అనే దానిపై స్పష్టత లేదు. అందుకే చర్చలు వాయిదా పడ్డాయి. ట్రంప్ మాత్రం "భారత్‌తో డీల్ అలాగే ఉంది, అందులో మార్పు లేదు" అని చెబుతున్నప్పటికీ, టారిఫ్ రేట్ల విషయంలో స్పష్టత వచ్చే వరకు అధికారులు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.

Next Story