కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో తీరుపై భారత్ గుస్సా..!

India Protests Trudeau's Remarks On Farmers' Agitation. కేం‍ద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా

By Medi Samrat  Published on  4 Dec 2020 12:34 PM GMT
కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో తీరుపై భారత్ గుస్సా..!

కేం‍ద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉంది. రైతుల ఆందోళనపై కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో, పార్లమెంట్‌ సభ్యులు ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు.

ఇండియాలో రైతు నిరసనల గురించి వస్తున్న వార్తలు వింటున్నామని.. అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎలా ఉన్నారోనన్న విషయం మనల్ని కలవరపెడుతుంది. మీ అందరి మనసుల్లో చెలరేగుతున్న కల్లోలం గురించి నేను అర్థం చేసుకోగలను. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి వాళ్లకు మనం అండగా ఉన్నామన్నారు. గురునానక్‌ 551వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఆన్‌లైన్‌ ఈవెంట్‌లో జస్టిన్‌ ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక సమస్య గురించి చర్చించడం అన్నింటి కంటే ముఖ్యమైనదన్నారు. ఈ విషయం గురించి భారత అధికారులతో మాట్లాడి మన ఆందోళనను తెలియజేద్దాం. మనమంతా కలిసికట్టుగా ఉండాల్సిన సమయం ఇదని అన్నారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అయింది. కెనెడా ప్రధానమంత్రి మన దేశంలో ఉన్న రైతుల బాధలను అర్థం చేసుకున్నారు కానీ.. మన దేశంలోని నేతలు అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శలు కూడా వచ్చాయి. ఈ వ్యాఖ్యలను భారత్‌ తప్పుబట్టింది. భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా తలదూర్చడాన్ని తీవ్రంగా పరిగణించింది కెనడా హైకమిషనర్‌కు ఆ దేశ మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యల తీవ్రతను తెలియజేసింది.. ఇలాంటి చర్యలు ఇకపై కొనసాగితే ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.


Next Story