ఉక్రెయిన్ నుండి సుమారు 22,500 మంది పౌరులు సురక్షితంగా తిరిగి వచ్చారని భారత్ తెలిపింది. 18 ఇతర దేశాలకు చెందిన పౌరుల తరలింపులో కూడా సహాయం చేసినట్లు తెలిపింది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో ఏర్పడ్డ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు UNలోని భారతదేశ అత్యున్నత రాయబారి తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ ఉక్రెయిన్ లో పరిస్థితులు నానాటికీ దిగజారుతుండటం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందని, ఉక్రెయిన్ లో నెలకొన్న మానవ సంక్షోభంపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం అన్ని దేశాలకు ఉందన్నారు.
భారత్ ఉక్రెయిన్ కు మరింత సాయాన్ని అందిస్తుందని తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ లో పరిస్థితులు దిగజారుతున్నాయని, వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది ఇతర దేశాలకు వలస వెళ్తున్నారని అన్నారు. ఆ దేశంలోని మానవతా పరిస్థితులపై భారత్ ఆవేదన వ్యక్తం చేస్తోందని.. మానవత్వంతో సాయం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఉక్రెయిన్ పౌరుల కోసం ఇప్పటికే 90 టన్నులకు పైగా ఔషధాలు ఇతర సహాయ సామగ్రిని పంపించామని వెల్లడించారు. గురువారం ఉక్రెయిన్‌పై UN భద్రతా మండలి బ్రీఫింగ్‌లో TS తిరుమూర్తి మాట్లాడుతూ అక్కడి ప్రజల అవసరాలను పరిష్కరించడానికి తక్షణ అవసరం ఉందని అన్నారు.