త్వరలో భారత్‌ నుంచి చైనాకు నేరుగా విమాన సర్వీసులు

వచ్చే నెల ప్రారంభం నుంచి భారత్‌-చైనాల మధ్య డైరెక్ట్‌ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

By Medi Samrat
Published on : 12 Aug 2025 8:39 PM IST

త్వరలో భారత్‌ నుంచి చైనాకు నేరుగా విమాన సర్వీసులు

వచ్చే నెల ప్రారంభం నుంచి భారత్‌-చైనాల మధ్య డైరెక్ట్‌ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. 2020లో గాల్వన్ వ్యాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బ‌తిన్నాయి. దాదాపు ఐదేళ్ల తర్వాత మళ్లీ రెండు దేశాల మధ్య సంబంధాలు చిగురిస్తున్నాయి. ఎయిరిండియా, ఇండిగో వంటి విమానయాన సంస్థలు తక్షణమే చైనాకు విమాన సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని భారత ప్రభుత్వం కోరింది. కరోనా కాలం తరువాత విమాన సేవలు నిలిపివేయబడ్డాయి.

కరోనా మహమ్మారికి ముందు రెండు దేశాల మధ్య ప్రతి నెల 539 డైరెక్ట్ విమానాలు ఉండేవి. వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఆగస్టు చివరిలో జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశంలో భారత్‌, చైనా మధ్య ప్రత్యక్ష విమాన సేవలను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు అధికారికంగా ప్రకటించబడవచ్చు.

గత నెలరోజులుగా ఇరు దేశాల మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. భారత్, చైనాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా సుంకాలు విధించడాన్ని ఇరు దేశాలు ఏకగ్రీవంగా వ్యతిరేకించాయి. భారత ప్రభుత్వం కూడా జూలై 24 నుంచి మళ్లీ చైనా పర్యాటకులకు వీసాలు మంజూరు చేయడం ప్రారంభించింది.

Next Story