మళ్లీ సరిహద్దుల్లో చైనా అలజడి
India China Border. సరిహద్దుల్లో చైనా మాత్రం తన దూకుడును ప్రదర్శిస్తూనే ఉంది.
By Medi Samrat
భారత్ ఓ వైపు కరోనా కారణంగా ఎంత ఇబ్బందులు పడుతూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరో వైపు సరిహద్దుల్లో చైనా మాత్రం తన దూకుడును ప్రదర్శిస్తూనే ఉంది. భారత్ తో తమకు సత్సంబంధాలు ఉన్నాయని చైనా చెబుతున్నా.. సరిహద్దుల్లో ఆ దేశ సైన్యం చేస్తున్న పనులు మాత్రం ఆ మాటలకు పూర్తీ వ్యతిరేకంగా ఉన్నాయి.
భారత సరిహద్దుల్లోకి ఆధునికీకరించిన రాకెట్ లాంచర్లను చైనా తరలిస్తోంది. టిబెట్ వద్ద ఉన్న ఓ స్థావరంలో వీటిని మోహరిస్తోంది. ఇక్కడి షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ గాల్వన్ లోయకు సమీపంలోనే ఉంటుంది. రాకెట్ లాంచర్లను చైనా తరలించడం వ్యూహాత్మకమేనని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాకెట్ దాడులతో ప్రత్యర్థి పదాతి బలగాలను ఆత్మరక్షణలోకి నెట్టడం సాధ్యమవుతుందని అందుకే చైనా ఈ పనులు చేస్తోందని చెప్పారు. షిన్ జియాంగ్ మిలిటరీ కమాండ్ స్థావరానికి రాకెట్ లాంచర్ల తరలింపును చైనా అధికారిక మీడియా సంస్థ సీసీటీవీనే వెల్లడించింది. ఇక్కడ మోహరించిన వాటిలో పీహెచ్ఎల్-03 రాకెట్ లాంచర్లు, శతఘ్నులు ఉన్నట్టు సీసీటీవీ విడుదల చేసిన చిత్రాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. భారత్ ఈ ఘటనపై చైనాను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక భారత్ కూడా సరిహద్దులో దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఇక చైనా ఎవరెస్ట్ పర్వతంపై కూడా విభజన రేఖ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకుంది. ఎందుకంటే నేపాల్ నుంచి ఎవరెస్ట్ అధిరోహిచండానికి వచ్చే పర్వతారోహకులు తమ దేశంలో ప్రవేశించడం వల్ల కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని చైనా భావిస్తోంది. దీన్ని కట్టడి చేయడం కోసం చైనా ఎవరెస్ట్ శిఖరంపై విభజన రేఖ ఏర్పాటు చేయాలని చైనా అనుకుంటూ ఉంది.