కరోనా మూలాలపై శోధించేందుకు చైనాలో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్‌వో బృందం
In Wuhan, WHO Team Begins Probe Into Coronavirus Origin. కరోనా మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనా దేశంలో ప్రపంచ ఆరోగ్య
By Medi Samrat Published on 30 Jan 2021 10:48 AM ISTకరోనా మహమ్మారి పుట్టినిల్లు అయిన చైనా దేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పర్యటిస్తోంది. కరోనా మూలాలను శోధించేందుకు వెళ్లిన డబ్ల్యూహెచ్‌వో కరోనాపై పరిశీలన మొదలు పెట్టింది. అయితే రెండు వారాల కిందటనే చైనాలోని వూహాన్‌కు చేరుకోగా, క్వారంటైన్ నిబంధనల ప్రకారం 14 రోజుల పాటు బృందం ఓ హోటల్‌కే పరిమితమైంది. తాజాగా క్వారంటైన్ గడువు ముగియడంతో కరోనా మూలాలపై దర్యాప్తు ప్రారంభించింది.
కోవిడ్ వైరస్ ముందు గబ్బిలాల నుంచే మానవులకు వ్యాపించినట్లు అంతర్జాతీయ నిపుణులు మొదటి నుంచి అనుమానిస్తున్నారు. కరోనా మూలాలపై భిన్న వాదనలు వినిపిస్తున్న డ్రాగన్ దేశం.. అంతర్జాతీయ దర్యాప్తు బృందానికి సహకరించలేదు. చైనా తీరుపై అమెరికా మొదటి నుంచే అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తాజాగా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా కరోనా మూలాలపై చైనా అసత్య వార్తలను ప్రచారం చేయవద్దని, కరోనా మూలాలు ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది. అమెరికా ప్రకటనపై అగ్రహించిన చైనా.. వీటిపై దర్యాప్తు జరుపుతోన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం పని తీరును గౌరవించాలని తెలిపింది.
కాగా, వూహాన్‌లో పర్యటిస్తున్న డబ్ల్యూహెచ్‌వో నిపుణుల బృందం కోవిడ్ మూలాల శోధనలో భాగంగా సెమినార్లు, క్షేత్ర పర్యటనలు చేయనున్నట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే కరోనా వైరస్ ముందు వ్యాపించినట్లు ప్రచారం జరిగిన వూహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌ను ఈ బృందం పర్యటిస్తుందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదే ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే ఆరోపించిన విషయం తెలిసిందే.
అయితే కరోనా విషయంలో చైనా మొదటి నుంచి ప్రపంచానికి సరైన సమాధానం ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. వీటికి మరింత బలం చేకూర్చే సంఘటనలు కొద్ది రోజులుగా చైనాలో మరింత ఎక్కువయ్యాయి. కోవిడ్ మూలాలపై మాట్లాడిన జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను చైనా సర్కార్ అణచివేస్తోందనే వాదనలున్నాయి.
వూహాన్ వాసుల డిమాండ్‌తో ఉలిక్కి పడ్డ చైనా
ఈ సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పర్యటిస్తున్న నేపథ్యంలో బృందం సభ్యులతో సమావేశం అవుతామని కోవిడ్‌తో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తుండటంతో చైనా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ బృందం వూహాన్‌కు చేరుకున్నప్పటి నుంచి స్థానిక అధికారులు తమను ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.