ఆప్ఘాన్‌లో బాలికలకు సంఘీభావంగా బాలురు ఏం చేస్తున్నారంటే..!
In solidarity with girls, Afghan boys refrain from going to school. ఆప్ఘానిస్తాన్‌లో బాలుర పాఠశాలలు తెరుచుకున్నాయి. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు
By అంజి
ఆప్ఘానిస్తాన్‌లో బాలుర పాఠశాలలు తెరుచుకున్నాయి. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లి చదువుకోవాలని ఇటీవల తాలిబన్ విద్యామంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే బాలికల మాధ్యమిక పాఠశాలలు తిరిగి తెరవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని విద్యాశాఖ తెలిపింది. కాగా బాలికల స్కూళ్లు ఎప్పుడు ప్రారంభిస్తామన్న తేదీని వారు ప్రకటించలేదని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మీడియాకు తెలిపారు. దీంతో దేశంలోని కొంతమంది బాలురు.. బాలికలకు సంఘీభావంగా ఇంటి వద్దనే ఉంటున్నారు. ఆప్ఘాన్ సమాజంలో సగభాగం మహిళలు ఉన్నారని.. బాలికల పాఠశాలలు తెరిచే వరకు తాను పాఠశాలకు వెళ్లనని రోహుల్లా అనే 18 ఏళ్ల విద్యార్థి ఓ ప్రముఖ ప్రత్రికకు తెలిపాడు. తాలిబన్లు 1996 నుండి 2001 వరకు ఆప్ఘానిస్తాన్‌ను పాలించినప్పుడు.. బాలికలు పాఠశాలలకు వెళ్లడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మహిళల ప్రాథమిక హక్కలను తాలిబన్లు కాలరాశారు.
కాబూల్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ అయినా నాజీఫ్ ప్రముఖ వార్త సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ... ''పాఠశాల తెరిచేందుకు తాము తగిన ఏర్పాట్లు చేశాం. బాలికలకు ఉదయం, బాలురకు మధ్యాహ్నం క్లాసులు జరుగుతాయి. అమ్మాయిలకు మహిళా ఉపాధ్యాయురాళ్లు, అబ్బాయిలకు మగ ఉపాధ్యాయులు విద్య బోధిస్తారు.'' అని చెప్పారు. బాలికల విద్య ఒక తరంపై ప్రభావం చూపుతుందని, అబ్బాయిల విద్య ఒక కుటుంబాన్ని మాత్రమే ప్రభావితం చేయగలదని'' ప్రధానోపాధ్యాయుడు మహమ్మద్రేజా అన్నారు. బాలికలు చదువుకోవడానికి తాము ఏం చేయాలో.. అదంతా చేస్తామని అన్నారు. ''ఆప్ఘాన్‌లో బాలికల పాఠశాలలు ఎప్పుడు తెరుచుకుంటాయో అని బాలికలు ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారని'' స్కూల్ మహిళా సెకండరీ లెవెల్ విద్యార్థులకు బోధించే హడిస్ రెజాయ్ అన్నారు. కాగా, ఇప్పటికే ఆప్ఘాన్‌లో బాలికల విద్యపై యూనైటెడ్ నేషన్ ఆర్గనైజనేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాలికల విద్యను పునఃప్రారంభించటం చాలా క్లిష్టమైనదని.. టీచింగ్‌ని తిరిగి ప్రారంభించడానికి మహిళా టీచర్లు అవసరమని యూనిసెఫ్ తెలిపింది.