పాకిస్థాన్ అట్టుడుకుతోంది. జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అతడి మద్దతుదారులు నిరసనలకు దిగగా పాకిస్థాన్ భద్రతా బలగాలు అర్ధరాత్రి దాడులు నిర్వహించాయి. వెంటపడి మరీ భద్రతాబలగాలు దాడులు చేయడంతో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు రోడ్లపై కుప్పకూలిపోయారు. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ నేతృత్వంలోని కాన్వాయ్ వెంట వేలాది మంది నిరసనకారులు సెంట్రల్ ఇస్లామాబాద్‌లో గుమిగూడారు. నగరంలోని రెడ్ జోన్ సమీపంలో భద్రతను కూడా దాటుకుంటూ వెళ్లారు. ఈ రెడ్ జోన్ ప్రాంతంలో పాకిస్తాన్ పార్లమెంట్, పలు ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. నిరసనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు పారామిలటరీ సైనికులు సహా ఆరుగురు మరణించారు.
క్షణాల్లో వందల మంది నేలకొరిగారని ప్రత్యక్ష సాక్ష్యులు వాపోయారు. కొన్ని వందల మంది మరణించారని తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతు దారుల మరణాలకు సంబంధించిన అధికారిక సమాచారం అందాల్సి ఉంది. వేలాది మంది ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులను అరెస్టు చేశారు. ఇస్లామాబాద్, రావల్పిండిలోని పాఠశాలలను మూసివేశారు. పలు రోడ్లను బ్లాక్ చేసినట్లు కూడా అధికారులు స్పష్టం చేశారు. పాక్ లో భద్రతా పరమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ ను బ్యాన్ చేశారు. నిరసనకారులు ప్రవేశించకుండా రాజధానికి వెళ్లే ప్రధాన రహదారులను మూసి వేశారు.