ఇమ్రాన్ ఖాన్ కు శస్త్ర చికిత్స

Imran Khan Surgery Completed. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాల్పుల్లో గాయపడ్డాడు.

By Medi Samrat  Published on  4 Nov 2022 8:00 PM IST
ఇమ్రాన్ ఖాన్ కు శస్త్ర చికిత్స

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కాల్పుల్లో గాయపడ్డాడు. ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇమ్రాన్ కాలికి బుల్లెట్ గాయాలవ్వడంతో.. లాహోర్ లోని షౌకత్ ఖానుమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ కు శస్త్రచికిత్స నిర్వహించినట్టు తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ నేత ఫవాద్ చౌదరి వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. పాకిస్థాన్ లో అత్యంత ప్రజాదరణ ఉన్న ఇమ్రాన్ ఖాన్ పై పక్కా ప్రణాళికతోనే కాల్పులు జరిపారని గట్టిగా నమ్ముతున్నామని చౌదరి పేర్కొన్నారు. పాకిస్థాన్ లో ముందస్తు ఎన్నికలు చేపట్టాలన్న డిమాండ్ తో ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ పేరిట లాహోర్ నుంచి రాజధాని ఇస్లామాబాద్ కు భారీ ర్యాలీ చేపట్టారు. ర్యాలీ వజీరాబాద్ వద్దకు చేరుకోగానే, కంటైనర్ పై నిల్చుని ప్రజలకు అభివాదం చేస్తున్న ఇమ్రాన్ పై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో గాయపడిన ఇమ్రాన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా ముగ్గురి ఆదేశాల మేరకే తనపై ఈ దాడి జరిగిందని ఇమ్రాన్ ఖాన్ విశ్వసిస్తున్నారని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ సీనియర్ నేతలు తెలిపారు. షెహబాజ్ షరీఫ్, రాణా సనావుల్లా, మేజర్ జనరల్ ఫైసల్ ఆదేశాల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ పై దాడి జరిగిందని పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నాయకులు అసద్ ఉమర్, మియాన్ అస్లాం ఇక్బాల్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని పీటీఐ నేతలు తెలిపారు.


Next Story