భార‌త్‌లో పెట్రో ధరల త‌గ్గింపు.. ప్ర‌శంసించిన ఇమ్రాన్ ఖాన్‌

Imran Khan praises India's foreign policy after fuel price cuts.అధికారంలో ఉన్న‌ప్పుడు భార‌త్‌పై ఆరోప‌ణ‌లు చేసిన

By తోట‌ వంశీ కుమార్‌  Published on  22 May 2022 5:32 AM GMT
భార‌త్‌లో పెట్రో ధరల త‌గ్గింపు.. ప్ర‌శంసించిన ఇమ్రాన్ ఖాన్‌

అధికారంలో ఉన్న‌ప్పుడు భార‌త్‌పై ఆరోప‌ణ‌లు చేసిన పాకిస్థాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ కాన్ ప‌ద‌వి కోల్పోయిన త‌రువాత ప్ర‌సంశ‌ల వ‌ర్షం కురిపిస్తున్నాడు. ఈ క్ర‌మంలో మ‌రోసారి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై ప్ర‌శంస‌లు కురిపించారు. కేంద్ర ప్ర‌భుత్వం దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించ‌డంపై ఆయ‌న స్పందించారు. భార‌త్ క్వాడ్‌లో స‌భ్య‌దేశ‌మైనా, అమెరికా నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్న‌ప్ప‌టికీ ర‌ష్యా నుంచి రాయితీపై చ‌మురు కొనుగోలు చేసి ప్ర‌జ‌ల‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించే చ‌ర్య‌లు తీసుకుంద‌న్నారు. భార‌త్‌కు స్వ‌తంత్ర విదేశాంగ విధానం ఉండ‌డం వ‌ల్లే అది సాధ్య‌మైంద‌న్నారు.

ఇక తాను పాకిస్థాన్‌లో అధికారంలో ఉండ‌గా త‌మ ప్ర‌భుత్వం కూడా ప్ర‌త్యేక విదేశాంగ విధానం కోసం కృషి చేసింద‌న్నారు. అయితే.. ఇప్పుడున్న ప్ర‌భుత్వంలోని మీర్ జాఫ‌ర్లు, మీర్ సాదిక్‌లు బ‌ల‌వంతంగా బాహ్య దేశాల ఒత్తిడికి త‌లొగ్గుతున్నార‌ని విమ‌ర్శించారు. పాక్ ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తింద‌ని అన్నారు. భార‌త ప్ర‌భుత్వం లీట‌ర్ పెట్రోల్ పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 త‌గ్గించిన అనంత‌రం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

అంత‌క‌ముందు ఏప్రిల్ లో కూడా ఇమ్రాన్ ఖాన్ భార‌త్‌ను ప్ర‌శంసించారు. ఏ సూప‌ర్ ప‌వ‌ర్ కూడా భార‌త‌దేశాన్ని ఆదేశించ‌లేద‌న్నారు. భార‌త్‌కు త‌మ ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ముఖ్యం అని ఇమ్రాన్ వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.

Next Story