లాడెన్ అమరవీరుడట.. ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు
Imran Khan Calling Osama Bin Laden A 'martyr'. ఒసామా బిన్ లాడెన్.. ప్రపంచంలో తీవ్రవాదానికి మారుపేరు..! ఎంతో మంది అమాయకుల ప్రాణాలను
By Medi Samrat Published on 27 Jun 2021 8:49 PM ISTఒసామా బిన్ లాడెన్.. ప్రపంచంలో తీవ్రవాదానికి మారుపేరు..! ఎంతో మంది అమాయకుల ప్రాణాలను తీసిన ఈ నరరూప రాక్షసుడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమరవీరుడంటూ పొగిడాడు. కొద్దిరోజుల కిందటే మహిళల బట్టలపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇమ్రాన్ ఖాన్.. ఇప్పుడు లాడెన్ ను పొగిడి మరింత చిక్కుల్లోపడ్డాడు. పాకిస్తాన్ ఎంతో మంది తీవ్ర వాదులకు అండగా నిలుస్తూ వచ్చింది. అల్ ఖైదా వ్యవస్థాపకుడు, కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు కూడా పాక్ ఆశ్రయం ఇచ్చింది. అమెరికా సేనల నుంచి రక్షించుకునేందుకు ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్ లోని అబ్బొట్టాబాద్ లో తలదాచుకున్నాడని తెలిసి.. అమెరికా నేవీ సీల్స్ కమాండోలు 2011లో ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి లాడెన్ ను అంతమొందించే వరకూ ఈ విషయం ప్రపంచానికి తెలియలేదు.
జూన్ లో పార్లమెంటులో ప్రసంగించిన ఇమ్రాన్ ఖాన్.. అమెరికా అబ్బొట్టాబాద్ లో ఆపరేషన్ నిర్వహించి ఒసామా బిన్ లాడెన్ ను చంపేసిందని, దాంతో ఆయన అమరవీరుడయ్యారని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక తీవ్రవాదిని అమరవీరుడంటూ ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను అంతర్జాతీయంగా తప్పుబడుతూ ఉన్నారు. ఒసామా బిన్ లాడెన్ ను అమరవీరుడిగా ఇమ్రాన్ ఖాన్ పేర్కొనడంపై పాక్ మంత్రి ఫవాద్ చౌదరి వివరణ ఇచ్చారు. పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి మాట్లాడుతూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొరబాటున ఆ వ్యాఖ్యలు చేశారని వివరణ ఇచ్చారు. ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ఎప్పటికీ ఓ ఉగ్రవాదిగానే భావిస్తుందని తెలిపారు. అల్ ఖైదాను ఓ ఉగ్రవాద సంస్థగానే పరిగణిస్తామని చౌదరి స్పష్టం చేశారు. ఇమ్రాన్ వ్యాఖ్యలను మరో కోణంలో చూస్తున్నారని.. మీడియాలోని ఓ వర్గం దీన్ని భూతద్దంలో చూపిస్తోందని ఆయన అన్నారు.