పాకిస్థాన్‌లో అనేక నాటకీయ పరిణామాల మధ్య రాజకీయ సంక్షోభం ముగిసింది. శనివారం అర్థరాత్రి దాటేవరకు హైడ్రామా కొనసాగింది. అవిశ్వాస తీర్మానంలో ప్రతి పక్షాలు విజయం సాధించాయి. దీంతో ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కోల్పోయాడు. 342 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో 174 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటువేశారు.
శనివారం సుమారు 14 గంటల పాటు అసెంబ్లీ సాగింది. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చింది. అజెండాలో ఓటింగ్ అంశం నాలుగో అంశంగా ఉండగా.. ఓ వ్యూహం ప్రకారం మంత్రులు ఒకరి తరువాత మరొకరు గంటల తరబడి సుదీర్ఘంగా ప్రసంగాలు కొనసాగించారు. ఓటింగ్‌ను నిర్వహించాలని పదే పదే ప్రతి పక్షాలు గగ్గోలు పెట్టాయి. ఎట్టకేలకు శనివారం అర్థరాత్రి అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించగా.. 174 మంది తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఇమ్రాన్ పదవీచ్యతుడయ్యారు.
పాక్ చరిత్రలో అవిశ్వాసం ఎదుర్కొని పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఆయన మిగిలిపోయారు. ఇదిలా ఉంటే..పాకిస్థాన్ ముస్లింలీగ్-నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్(నవాజ్ షరీప్ సోదరుడు) తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉంది. ఇక తన ఓటమి ఖాయమని ముందే నిర్ణయానికి వచ్చిన ఇమ్రాన్ ఖాన్.. సభలో ఓ వైపు ఓటింగ్ జరుగుతుండగానే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు.