చైనా యుద్ధం చేయాలనే తలంపుతో ఉందా..?
IAF chief says Chinese air assets fully deployed. భారత్-చైనా దేశాల మధ్య ఇటీవలి కాలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
By Medi Samrat Published on 30 Dec 2020 7:30 PM IST
భారత్-చైనా దేశాల మధ్య ఇటీవలి కాలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత్ శాంతి అని అంటున్నా చైనా మాత్రం కయ్యానికి కాలు దువ్వుతోంది. ఇక భారత్ కూడా ప్రతి స్పందించాల్సి వస్తోంది. చైనాను ఎక్కడికక్కడ నిలువరిస్తూ ఉంది. తాజాగా చైనా చేపడుతున్న చర్యలను చూస్తూ ఉంటే ఆ దేశం యుద్ధ సన్నాహాల్లో ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. చైనా వైమానిక దళం భారత సరిహద్దుల్లోని లడఖ్ ప్రాంతానికి భారీ మిసైల్స్ ను, రాడార్లను తరలించింది.
తూర్పు లడఖ్ ప్రాంతానికి చైనా అత్యాధునిక ఆయుధాలను తరలించిందని స్పష్టం చేసిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బహదూరియా, భారత్ తరఫున తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటున్నామని అన్నారు. ఎల్ఏసీ (వాస్తవాధీన రేఖ) వెంబడి చైనా జవాన్లకు మద్దతుగా అత్యాధునిక ఆయుధాలు వచ్చి చేరుతున్నాయని అన్నారు. పెద్దఎత్తున రాడార్లు, భూ ఉపరితలం పైనుంచి గాల్లోకి వెళ్లి లక్ష్యాలను ధ్వంసం చేసే మిసైల్స్ ను కూడా మోహరించారని అన్నారు. చైనా దేశీయంగా అభివృద్ధి చేసిన జే-20, జే-10 యుద్ధ విమానాలు, రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్యూ-30 విమానాలను సైతం సరిహద్దులకు తరలించిందని ధృవీకరించారు. రష్యా నుంచి తెచ్చిన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను సైతం యాక్టివేట్ చేసిందని ఆయన అన్నారు.
చైనాను ఎదుర్కొనేందుకు ఫ్రంట్ లైన్ ఫైటర్ జెట్లను భారత్ సిద్ధంగా ఉంచిందని అన్నారు. రాఫెల్ తో పాటు మిగ్-29 విమానాలు పలు ఎయిర్ బేస్ లలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు.