తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ రాజధానిని స్వాధీనం చేసుకోవడంతో వేలాది మంది ఆఫ్ఘన్ పౌరులు హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చేరుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ ను వీడాలని ప్రజలు భావించారు. తాలిబాన్ల చేతిలో హింసను భరించలేక ఆఫ్ఘన్‌లు తమ ఇళ్ల నుంచి విమానాశ్రయానికి పెద్ద సూట్‌కేసులతో ఎయిర్ పోర్టును చేరుకున్నారు. దీంతో విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రయాణీకులు ఏకంగా విమానాల దగ్గరకు వెళ్లిపోయారు. అక్కడ ఉంచిన విమానాలను ఎక్కడానికి ప్రయత్నించారు. అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాబూల్ విమానాశ్రయంలో పార్క్ చేయబడిన విమానం చుట్టూ జనం గుమిగూడారు. ముందు తలుపుకు అనుసంధానించబడిన ఏకైక నిచ్చెన నుండి క్యాబిన్ లోపలికి వెళ్ళడానికి తీవ్రంగా పోరాడుతున్నారు. చాలా మంది టార్మాక్ చుట్టూ నడుస్తూ.. విమానం ఎక్కడానికి ప్రయత్నం చేస్తుండడం కూడా వీడియోలో కనిపిస్తుంది. కాబూల్ విమానాశ్రయం నుండి వచ్చిన దృశ్యాలు విమానాశ్రయం కంటే అస్తవ్యస్తమైన బస్టాండ్‌ని పోలి ఉంటాయి.
ఇక కొన్ని ప్రాంతాల్లో టార్మాక్ చుట్టూ ముళ్ల తీగలు ఉంచారు. వాటి వెనుక విమానాశ్రయానికి కాపలాగా ఉన్న కొద్దిమంది యుఎస్ సైనికులను చూడొచ్చు. విమానాశ్రయంలోని అమెరికా దళాలు ఈ ఉదయం జనాన్ని చెదరగొట్టడానికి గాలిలోకి కాల్పులు జరిపాయి.