బలూచిస్థాన్ ప్రజలు పాక్‌ను ఎందుకు తమ శత్రువుగా భావిస్తారు..? రైలు హైజాక్ వెనుక కారణం ఇదే..

పాకిస్తాన్‌లోని నాలుగు ప్రావిన్సులలో బలూచిస్తాన్ అతిపెద్ద ప్రావిన్స్. కానీ అతి తక్కువ జనాభాను కలిగి ఉంది.

By Medi Samrat
Published on : 12 March 2025 3:40 PM IST

బలూచిస్థాన్ ప్రజలు పాక్‌ను ఎందుకు తమ శత్రువుగా భావిస్తారు..? రైలు హైజాక్ వెనుక కారణం ఇదే..

పాకిస్తాన్‌లోని నాలుగు ప్రావిన్సులలో బలూచిస్తాన్ అతిపెద్ద ప్రావిన్స్. కానీ అతి తక్కువ జనాభాను కలిగి ఉంది. బలూచిస్థాన్‌లో చాలా అరుదుగా శాంతి నెలకొని ఉంటుంది. అందుకే ఎన్నో సంవత్సరాలు గడిచినా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) ఉగ్రవాదులు మార్చి 11న పాకిస్థాన్ రైలును హైజాక్ చేశారు.

దీంతో BLA తిరుగుబాటుదారులు రైలును హైజాక్ చేసి భద్రతా సిబ్బందితో సహా 100 మందిని ఎందుకు బందీలుగా పట్టుకున్నారు. వారి తిరుగుబాటుకు ప్రధాన కారణం ఏమిటి అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ తిరుగుబాటుకు కారణం పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నా బలూచ్ ప్రజలకు చేసిన ద్రోహం.

బలూచ్ ప్రజల తిరుగుబాటు..

1971లో బంగ్లాదేశ్‌ను పాకిస్తాన్ నుండి వేరుచేయడం వల్ల బలూచిస్థాన్‌లోని నేషనల్ అవామీ పార్టీ నాయకులు ఎక్కువ స్వయంప్రతిపత్తి కోసం డిమాండ్‌లు చేశారు.

అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఈ డిమాండ్లను తిరస్కరించడంతో నిరసనలు ఉధృతమయ్యాయి.

1973లో భుట్టో అక్బర్ ఖాన్ బుగ్తీ నేతృత్వంలోని బలూచిస్థాన్ ప్రావిన్షియల్ ప్రభుత్వాన్ని తొలగించాడు.

దీని తరువాత 1977 వరకు పెద్ద ఎత్తున సాయుధ తిరుగుబాటు జరిగింది. దీనిని నాల్గవ బలూచిస్తాన్ సంఘర్షణగా పిలుస్తారు.

1977లో జనరల్ జియా-ఉల్-హక్ సైనిక తిరుగుబాటులో భుట్టోను తొలగించారు.

గిరిజనులకు క్షమాభిక్ష, బలూచిస్తాన్ నుండి సైనిక ఉపసంహరణ తర్వాత సాయుధ పోరాటం ముగిసింది.

బలూచిస్థాన్‌ను పాకిస్థాన్‌లో ఎలా విలీనం చేశారు?

బలూచిస్తాన్ తిరుగుబాటుకు మూలకారణం 1947లో భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయినప్పుడు ప్రారంభమైంది. బలూచిస్తాన్ ప్రాంతం నాలుగు రాచరిక రాష్ట్రాల రూపంలో ఉంది. కలాత్, ఖరన్, లాస్ బేలా, మక్రాన్.

బలూచిస్తాన్‌కు భారత్‌లో విలీనం అవ‌డానికి.. పాకిస్తాన్‌లో ఉండిపోవ‌డానికి లేదా స్వాతంత్ర్యంగా కొనసాగ‌డానికి అవకాశం ఉంది. కానీ జిన్నా ప్రభావం వల్ల నాలుగు రాష్ట్రాలలో మూడు రాష్ట్రాలు పాకిస్థాన్‌లో కలిసిపోయాయి. కలాత్ మాత్ర‌మే స్వాతంత్ర్య రాజ్యంగా ఉండేందుకు ఎంచుకుంది.

1947 ఆగస్టు 4న ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఖాన్ ఆఫ్ కలాత్, లార్డ్ మౌంట్ బాటన్, జవహర్‌లాల్ నెహ్రూలతో కూడిన సమావేశంలో జిన్నా స్వాతంత్ర్యం ఉంటామ‌న్న‌ ఖాన్ నిర్ణయాన్ని సమర్థించారు. జిన్నా పట్టుదలతో ఖరన్, లాస్ బేలాలను కలత్‌తో విలీనం చేసి పూర్తి బలూచిస్తాన్‌గా ఏర్పాటు చేశారు.

కలాత్‌కు 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రాన్ని ప్రకటించారు. స్వతంత్ర సార్వభౌమ రాజ్యంగా ఉన్నప్పటికీ, సెప్టెంబరు 12 నాటి బ్రిటిష్ మెమోరాండం, స్వతంత్ర రాజ్య అంతర్జాతీయ బాధ్యతలను కలాత్ నిర్వర్తించలేడని పేర్కొంది.

బలూచ్ జాతీయవాదం.. 1980 వరకు దాని మూలం-అభివృద్ధిలో ఇలా వ్రాశారు.. 'అక్టోబర్ 1947లో జ‌రిగిన సమావేశంలో పాకిస్తాన్‌లో కలాత్‌ను త్వరగా విలీనం చేయాలని జిన్నా ఖాన్‌ను కోరారు.' అయితే ఖాన్ కలాత్‌పై జిన్నా వాదనను తిరస్కరించాడు.. భారతదేశంతో సహా అనేక దేశాల నుండి సహాయం కోరాడు. ఎక్కడి నుంచి సాయం అందకపోవడంతో చేతులెత్తేశాడు. మార్చి 26న పాకిస్తానీ బలగాలు బలూచ్ తీర ప్రాంతంలోకి ప్రవేశించాయి. ఖాన్.. జిన్నా నిబంధనలను అంగీకరించవలసి వచ్చింది. 226 రోజుల పాటు స్వతంత్రంగా ఉన్న తర్వాత.. బలూచిస్తాన్ పాకిస్తాన్‌లో విలీనం చేయబడింది.

ఇది ప్రజల అభీష్టం వల్ల కాదు.. జిన్నా ద్రోహం, ఇస్లామాబాద్ సైనిక శక్తి కారణంగా జ‌రిగింది. దీంతో బలూచిస్థాన్‌ ఎప్పటికప్పుడు పాకిస్థాన్‌పై యుద్ధం చేస్తూనే ఉంది.

Next Story