లండన్ లో విలువైన లగ్జరీ 'బెంట్లీ' కారు దొంగిలించారు.. పాకిస్తాన్‌లో ప్రత్యక్షం

How high-end Bentley car stolen from London was found in Pakistan’s Karachi. కొన్ని వారాల క్రితం లండన్ లో దొంగిలించబడిన $300,000 కంటే ఎక్కువ విలువైన లగ్జరీ 'బెంట్లీ' కారు

By Medi Samrat  Published on  4 Sep 2022 1:20 PM GMT
లండన్ లో విలువైన లగ్జరీ బెంట్లీ కారు దొంగిలించారు.. పాకిస్తాన్‌లో ప్రత్యక్షం

కొన్ని వారాల క్రితం లండన్ లో దొంగిలించబడిన $300,000 కంటే ఎక్కువ విలువైన లగ్జరీ 'బెంట్లీ' కారు ఇప్పుడు పాకిస్తాన్‌లో ప్రత్యక్షమైంది. కరాచీలోని ఒక బంగ్లాలో ఈ కారు కనుగొనబడిందని తెలుస్తోంది. దొంగిలించబడిన బెంట్లీ ముల్సాన్నే సెడాన్ కారు ఒక వ్యక్తి ఇంట్లో పార్క్ చేసినట్లు UK నేషనల్ క్రైమ్ ఏజెన్సీ తెలిపింది. సమాచారం అందుకున్న తరువాత కరాచీలోని కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (CCE) కలెక్టరేట్ దాడులు నిర్వహించింది.

దొంగతనంలో పాల్గొన్న వారు బెంట్లీలోని ట్రేసింగ్ ట్రాకర్‌ను తీసివేయడంలోనూ.. స్విచ్ ఆఫ్ చేయడంలోనూ విఫలమయ్యారని తెలుస్తోంది. అధునాతన ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా వాహనం ఖచ్చితమైన లొకేషన్ ను గుర్తించారు. లొకేషన్ ను గుర్తించే పరికరం బాగా పని చేస్తూ ఉండడంతో కారు గుర్తించడానికి UK అధికారులకు సహాయపడిందని పాకిస్థాన్ మీడియాలో ఒక నివేదిక పేర్కొంది.

అధికారులు నిర్వహించిన దాడులలో పాకిస్తాన్ రిజిస్ట్రేషన్, నంబర్ ప్లేట్‌తో కూడిన బెంట్లీని కనుగొన్నారు. UK అధికారులు అందించిన దొంగిలించబడిన వాహనం వివరాలతో కారు ఛాసిస్ నంబర్ సరిపోలినట్లు వారు కనుగొన్నారు. కారు పార్క్ చేసి ఉంచిన ఇంటి యజమాని తగిన పత్రాలు అందించకపోవడంతో వాహనాన్ని సీజ్ చేశారు. అతనికి అత్యాధునిక కారు విక్రయించిన బ్రోకర్‌ను కూడా అరెస్టు చేశారు. వాహనం రిజిస్ట్రేషన్ నకిలీదని అధికారులు తెలిపారు.

ఈ మొత్తం రాకెట్‌లో పాల్గొన్న వారు అగ్ర దౌత్యవేత్తకు సంబంధించిన పత్రాలను ఉపయోగించి కారును పాకిస్తాన్‌కు దిగుమతి చేసుకున్నారని తెలుస్తోంది. కస్టమ్స్ అధికారులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, దొంగిలించబడిన వాహనం స్మగ్లింగ్ కారణంగా 300 మిలియన్లకు పైగా పాకిస్తానీ రూపాయల పన్ను ఎగవేశారు.
Next Story
Share it