Pakistan: ముష్కరుల కాల్పుల్లో హిందూ డాక్టర్ మృతి

పాకిస్తానీ హిందూ వైద్యుడు బీర్బల్ జెనానీ తన క్లినిక్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా కరాచీలోని లాయారీ సమీపంలో దారుణ హత్య

By అంజి  Published on  31 March 2023 9:33 AM IST
Hindu doctor, Pakistan, Crime news, internationalnews

Pakistan: ముష్కరుల కాల్పుల్లో హిందూ డాక్టర్ మృతి

పాకిస్తానీ హిందూ వైద్యుడు బీర్బల్ జెనానీ గురువారం తన క్లినిక్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా కరాచీలోని లాయారీ సమీపంలో దారుణ హత్యకు గురయ్యాడు. కరాచీ మెట్రోపాలిటన్ కార్పొరేషన్ (KMC) మాజీ సీనియర్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్, కంటి స్పెషలిస్ట్ డాక్టర్ బీర్బల్ జెనాని గురువారం కరాచీలో గుర్తు తెలియని దుండగులచే కాల్చి చంపబడ్డారని జియో న్యూస్ తెలిపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ బీర్బల్ జెనానీ, అతని అసిస్టెంట్ లేడీ డాక్టర్ రాంస్వామి నుండి గుల్షన్-ఎ-ఇక్బాల్‌కు ప్రయాణిస్తుండగా, లియారీ ఎక్స్‌ప్రెస్‌వేలోని గార్డెన్ ఇంటర్‌ఛేంజ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వారి కారును లక్ష్యంగా చేసుకున్నారు. డాక్టర్ జెనాని అక్కడికక్కడే మరణించగా, అతని అసిస్టెంట్ లేడీ డాక్టర్‌కు బుల్లెట్ గాయాలు తగిలాయి.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో డాక్టర్ జెనాని కారు అదుపుతప్పి గోడను ఢీకొట్టినట్లు కనిపిస్తోంది. ఎస్‌ఎస్‌పీ సిటీ ఆరిఫ్ అజీజ్ మాట్లాడుతూ.. డాక్టర్ జెనాని హత్య "టార్గెట్ కిల్లింగ్" అని అన్నారు. హత్య వెనుక ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదని ఆరిఫ్ అజీజ్ తెలిపారు. గుర్తుతెలియని దుండగులు వాహనంపై దాడి చేసిన సమయంలో డాక్టర్ జెనానితో కలిసి పనిచేసిన మహిళా డాక్టర్ వాహనంలో ఉన్నారు.

గాయపడిన మహిళ తెలిపిన వివరాలను పోలీసు అధికారి వెల్లడించారు. "అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభమయ్యాయి. నాకు ఏమీ అర్థం కాలేదు." అని ఆమె చెప్పారు. జియో న్యూస్ రిపోర్టు ప్రకారం.. వాహనంపై ఒకే ఒక్క బుల్లెట్ గుర్తు ఉందని తెలిపారు. మహిళా డాక్టర్ స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తున్నామని పోలీసు అధికారి తెలిపారు. హత్యపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసు అధికారి తెలిపారు. సింధ్ గవర్నర్ కమ్రాన్ ఖాన్ టెస్సోరీ కరాచీ పోలీసు అదనపు ఇన్‌స్పెక్టర్ జనరల్ నుండి ఈ సంఘటనకు సంబంధించి నివేదికను కోరారు. కంటి నిపుణుడి హత్యపై విచారం వ్యక్తం చేశారు.

రంజాన్ ఆర్డినెన్స్‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ గత వారం పాకిస్థాన్‌లో హిందూ దుకాణదారులు దాడి చేశారని పాకిస్థాన్‌లోని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది.

Next Story