ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి బయటపడేందుకు వివిధ దేశస్తులతో పాటు ఆఫ్ఘన్ ప్రజలు కూడా కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. వేల సంఖ్యలో చేరుకున్నారు ప్రజలు. ఏదో ఒక విమానం ఎక్కి.. ఏదో ఒక దేశంలో బ్రతికేద్దామని అనుకుంటూ ఉన్నారు. అందుకే పెద్ద ఎత్తున కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. అయితే కాబూల్ విమానాశ్రయం వద్ద ఉగ్రవాద దాడి జరిగే ప్రమాదముందని అమెరికా సహా వివిధ దేశాలు హెచ్చరించాయి. ఆ ప్రాంతంలో ఎవరూ ఉండొద్దని తమ దేశాల పౌరులకు సూచించాయి. కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ఘనిస్థాన్ గ్రూప్ దాడులకు తెగబడే అవకాశం ఉందని, ఎవరూ విమానాశ్రయం చుట్టుపక్కలకు రావొద్దని తమ ప్రజలకు పలు దేశాలు సూచించాయి.
యాబీ గేట్, తూర్పు గేట్, ఉత్తర గేట్ వద్ద ఉన్న అమెరికా ప్రజలంతా వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. ఉగ్రవాద దాడి ముప్పు అత్యంత ఎక్కువగా ఉందని ఆస్ట్రేలియా విదేశాంగ వ్యవహారాల శాఖ కూడా హెచ్చరించింది. కాబూల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఆస్ట్రేలియన్లు ఎవరూ రావొద్దని సూచించింది. ఒకవేళ ఎవరైనా ఉండి ఉంటే వెంటనే అక్కడి నుంచి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలని, తదుపరి సూచనలు వచ్చే వరకు వేచి చూడాలని తెలిపింది. బ్రిటన్ కూడా తమ దేశస్తులను అక్కడి నుండి వెళ్లిపోవాలని సూచించింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ లో ఇరుక్కున్న ఇతర దేశస్తుల పరిస్థితి ఎటూ తేలకుండా పోతోంది.