బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇటీవల రియాద్‌లో జరిగిన జాయ్ ఫోరం 2025లో బలూచిస్తాన్, పాకిస్తాన్‌లను విడివిడిగా ప్రస్తావించిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వం ఆయనను "ఉగ్రవాది"గా ముద్ర వేసింది. భారతీయ సినిమా ప్రపంచవ్యాప్త పరిధి గురించి ఆయన మాట్లాడారు. ఆ సమయంలో చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ ప్రభుత్వానికి నచ్చలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం సల్మాన్ ఖాన్ పేరును తన నాల్గవ షెడ్యూల్‌లో చేర్చిందని, ఇది దేశ ఉగ్రవాద నిరోధక చట్టం (1997) కిందకు వస్తుంది. ఈ జాబితా సాధారణంగా ఉగ్రవాద సంస్థలు లేదా కార్యకలాపాలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానించబడిన వ్యక్తుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది. దీని కింద ఉన్న వాళ్లు కఠినమైన నిఘాను ఎదుర్కొంటారు.
‘జాయ్ ఫోరమ్ 2025’ కార్యక్రమంలో సల్మాన్ మాట్లాడుతూ భారతీయ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతుందన్నారు. ఒక హిందీ సినిమాను సౌదీ అరేబియాలో విడుదల చేస్తే తప్పకుండా సూపర్‌హిట్ అవుతుందని, తెలుగు, తమిళ్, మలయాళ సినిమాలు కూడా ఇక్కడ కోట్ల రూపాయలు రాబడుతున్నాయన్నారు. దీనంతటికీ కారణం పలు దేశాలకు చెందిన ప్రజలు సౌదీలో ఉండటమేనన్నారు. బలూచిస్తాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ నుంచి వచ్చిన ప్రజలు ఎక్కువగా ఉన్నారని సల్మాన్ చెప్పారు. పాకిస్థాన్‌కు చెందిన బలోచిస్థాన్‌ను పాకిస్థాన్ నుండి వేరు చేసి మాట్లాడటం ఏంటి అంటూ అక్కడి మీడియా కూడా విమర్శలు చేసింది. అయితే, బలూచిస్తాన్ వేర్పాటువాద నాయకులు మాత్రం సల్మాన్ చేసిన ప్రకటనను స్వాగతించారు.