పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించిన ఘటన వెనుక ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కు పాకిస్తాన్ దాదాపు నాలుగు రెట్లు భద్రతను పెంచిందని తెలుస్తోంది. భద్రతలో భాగంగా పాకిస్తాన్ సాయుధ దళాల నుండి సిబ్బందిని మోహరించారు. లాహోర్‌లోని సయీద్ నివాసం చుట్టూ ఇప్పుడు నిఘాను ముమ్మరం చేశారు.
లాహోర్‌లోని జనసాంద్రత కలిగిన నివాస ప్రాంతమైన మొహల్లా జోహార్ టౌన్‌లో ఉన్న హఫీజ్ సయీద్ ఇల్లు ఏప్రిల్ 22 దాడి తర్వాత భద్రతా వలయంలోకి వెళ్లింది. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ, లష్కరే కార్యకర్తలు సంయుక్తంగా అతని రక్షణను పర్యవేక్షిస్తున్నారని, ఆ ప్రాంగణాన్ని పర్యవేక్షించడానికి డ్రోన్ నిఘాను మోహరించారు. అతడి ఇంటి చుట్టుపక్కల ఉన్న రోడ్లపై హై-రిజల్యూషన్ సిసిటివి కెమెరాలు అమర్చారు.
భవనం దగ్గరకు పౌరుల కదలికలు అనుమతించడం లేదు. ఆ ప్రాంతంలో ఇతరుల డ్రోన్లను నిషేధించారు. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) పహల్గామ్ దాడి జరిగిన కొద్దిసేపటికే ఈ భద్రతా ప్రోటోకాల్ అమలులోకి వచ్చిందని వర్గాలు తెలిపాయి.