దిశా రవికి మద్దతుగా గ్రెటా థన్‌బర్గ్‌ ట్వీట్

Greta Thunberg extends support to Disha Ravi. టూల్‌కిట్ వివాదంలో బెంగళూరుకు చెందిన దిశా రవి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  20 Feb 2021 1:10 PM GMT
దిశా రవికి మద్దతుగా గ్రెటా థన్‌బర్గ్‌ ట్వీట్

టూల్‌కిట్ వివాదంలో బెంగళూరుకు చెందిన దిశా రవి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే..! దిశా రవికి మద్దతుగా స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్ ట్వీట్ చేశారు. #StandWithDishaRavi హ్యాష్‌ట్యాగ్‌తో చేసిన ఈ ట్వీట్‌లో.. మాట్లాడే స్వేచ్ఛ, ప్రశాంతంగా నిరసన తెలిపే స్వేచ్ఛ అనేవి రాజీపడకూడని మానవ హక్కులని, ప్రజాస్వామ్యంలో అవి భాగం కావాల్సిందేనని తెలిపారు. "వాక్ స్వాతంత్య్రం, శాంతియుత నిరసన, సమావేశమయ్యే హక్కులు చర్చించలేని మానవ హక్కులు. ఇవి ఏ ప్రజాస్వామ్యంలోనైనా ఒక ప్రాథమిక భాగం అయి ఉండాలి" అని అన్నారు. 'ఫ్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్‌' ఇండియా ఛాఫ్టర్‌ తరఫున చేసిన ట్వీట్‌లో గ్రెటా ధన్‌బర్గ్ 'స్టాండ్‌ విత్‌ దిశా రవి' హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. దిశా రవి అరెస్ట్ అయిన ఐదు రోజుల తర్వాత గ్రెటా స్పందించింది.


దిశా ఈ ఉద్యమంలో ఒక భాగంగా ఉందని, ఆమె భారతదేశంలో పర్యావరణ ఆందోళనలను వ్యక్తం చేయడమే కాకుండా, ప్రపంచ వాతావరణ ఉద్యమంలో దేశం యొక్క అత్యంత ప్రభావిత, అట్టడుగు వర్గాల సమానత్వం మరియు ప్రాతినిధ్యం కోసం కృషి చేసిందని గ్రెటా పేర్కొన్నారు. అంతే కాదు దిశా రవి మనందరిలో అత్యుత్తమమైనదని చెప్పడానికి మాకు ఎలాంటి సంకోచం లేదంటూ గ్రెటా ప్రైడేస్‌ ఫర్‌ ఫ్యూచర్స్‌ తరఫున చేసిన ట్వీట్లలో తెలిపారు.

రైతులు చేపట్టిన నిరసనలో భాగంగా, ఢిల్లీలో జనవరి 26న జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గ్రెటా థన్‌బర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ టూల్‌కిట్‌ వివాదానికి దారి తీసింది. ఈ అంశంపై దృష్టి సారించిన ఢిల్లీ పోలీసులు దిశ రవి, శాంతను ములుక్‌, నికితా జాకబ్‌ అనే ముగ్గురు యువతులపై అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రెటా షేర్‌ చేసిన టూల్‌ను ఎడిట్‌ చేసి హింసకు ప్రేరేపించారన్న ఆరోపణలతో దిశ రవి, నికితను అరెస్టు చేశారు. తాజాగా దిశా రవి జ్యుడీషియల్ కస్టడీని మరో మూడు రోజులు పొడిగిస్తూ ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు తీర్పు చెప్పింది.


Next Story