అక్కడున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలి
కెనడాలో ఉంటున్న భారత పౌరులు, విద్యార్థులకు భారత ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.
By M.S.R Published on 20 Sept 2023 9:45 PM ISTకెనడాలో ఉంటున్న భారత పౌరులు, విద్యార్థులకు భారత ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. అందుకు సంబంధించి ప్రత్యేక గైడ్‌లైన్స్ విడుదల చేసింది భారత విదేశాంగ శాఖ. హింసల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని కెనడాలోని భారతీయులను హెచ్చరించింది. ప్రయాణాలపై ఆచితూచి వ్యవహరించాలని సూచిస్తూ ప్రత్యేక ట్రావెల్ అడ్వయిజరీని విడుదల చేసింది. ఆందోళనలు జరిగే ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని కోరింది. కెనడా వెళ్లాలనుకునేవాళ్లు.. అవసరమైతే ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరింది.
జూన్‌లో జరిగిన సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. మంగళవారం ట్రూడో విలేకరులతో మాట్లాడుతూ.. తాము భారత్‌ను రెచ్చగొట్టడానికి చూడటం లేదన్నారు. తాము భారత్‌తో కలసి పని చేయాలనుకుంటున్నామని, ఈ క్రమంలో ప్రతి విషయం స్పష్టంగా సరైన ప్రక్రియలో ఉన్నాయని నిర్ధారించుకోవాలనని అనుకుంటున్నట్లు చెప్పారు.
నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ట్రూడో వాదనలను భారత్ తిరస్కరించింది. కెనడాలో హింసాత్మక చర్యలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందనే ఆరోపణలు పూర్తి అసంబద్ధమైనవని, ప్రేరేపించబడినవి అంటూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.