ఫ్రాన్స్ అధ్యక్షుడికి కరోనా.. ఫ్రెంచ్ లో మెసేజీ పంపిన మోదీ
French President Macron Tests COVID-19 Positive. కరోనా మహమ్మారి అత్యధికంగా ప్రభావం చూపించిన దేశాల్లో యూరప్ దేశాలు
By Medi Samrat Published on 17 Dec 2020 7:31 PM IST
కరోనా మహమ్మారి అత్యధికంగా ప్రభావం చూపించిన దేశాల్లో యూరప్ దేశాలు ఉన్నాయి. ఫ్రాన్స్ లో మరోసారి లాక్ డౌన్ కూడా విధించారు. ఇప్పటి వరకు ఆ దేశంలో 59 వేలకు పైగా ప్రజలు కరోనా వల్ల మృతి చెందారు. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని అక్కడి అధ్యక్ష భవనం అధికారికంగా ప్రకటించింది. మేక్రాన్ లో స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకున్నారని టెస్టులో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని చెప్పారు. కరోనా పాజిటివ్ అని తెలియగానే ఫ్రాన్స్ దేశాధినేత మేక్రాన్ హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు. అటు మేక్రాన్ అర్ధాంగి బ్రిగెట్టే (67)కు పారిస్ లోని ఓ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని వచ్చింది. ఏడు రోజుల పాటు ఐసొలేషన్ లోనే ఉండి విధులను నిర్వహిస్తారని అధ్యక్ష భవనం తెలిపింది. పోర్చుగీస్ ప్రధాని ఆంటోనియో కోస్టాతో ఇటీవలే మేక్రాన్ భేటీ అయ్యారు.
Je souhaite à mon cher ami @EmmanuelMacron un prompt rétablissement et une bonne santé.
— Narendra Modi (@narendramodi) December 17, 2020
ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ కు కరోనా పాజిటివ్ అని తెలియగానే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అది కూడా ఫ్రెంచ్ భాషలో.. Je souhaite à mon cher ami @EmmanuelMacron un prompt rétablissement et une bonne santé. అంటూ ట్వీట్ చేశారు మోదీ. "మై డియర్ ఫ్రెండ్ నువ్వు త్వరగా కోలుకోవాలి. పరిపూర్ణ ఆరోగ్యవంతుడివి కావాలి" అని ట్వీట్ సారాంశం.