రోమన్ క్యాథలిక్కుల మత గురువు మాజీ పోప్ బెనెడిక్ట్ కన్నుమూశారు. ఆయన మృతి చెందినట్టు వాటికన్ సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. బెనెడిక్ట్ వయసు 95 సంవత్సరాలు. కొన్ని రోజులుగా బెనెడిక్ట్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హృద్రోగ సమస్యతో పాటు ఇతర వ్యాధులకు కూడా చికిత్స తీసుకుంటున్నారు. "పోప్ ఎమెరిటస్, బెనెడిక్ట్ XVI, వాటికన్‌లోని మేటర్ ఎక్లెసియే మొనాస్టరీలో ఈరోజు ఉదయం 9:34 గంటలకు కన్నుమూశారని నేను మీకు బాధతో తెలియజేస్తున్నాము" అని వాటికన్ ప్రతినిధి మాటియో బ్రూనీ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయన తీవ్ర అనారోగ్యంతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఈ ఉదయం 9.30 గంటలకు ప్రాణాలు వదిలినట్టు ప్రకటనలో తెలిపారు. జనవరి 2 నుంచి సెయింట్ పీటర్స్ బేసిలికా వద్ద పోప్ భౌతికకాయాన్ని ఉంచుతామని తెలిపారు. పోప్ బెనెడిక్ట్ అంత్యక్రియలకు సంబంధించిన వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. జర్మన్ పోప్ ఎమెరిటస్ ఒరిజినల్ పేరు జోసెఫ్ రాట్‌జింగర్, ఫిబ్రవరి 2013లో పదవీవిరమణ చేశారు. ఇదొక షాకింగ్ నిర్ణయం అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఆయన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.