ఆఫ్ఘనిస్తాన్ లో మినిస్టర్ గా ఉన్న వ్యక్తి కాస్తా ఇప్పుడు డెలివరీ బాయ్ గా మారిపోయారు. సయ్యద్ అహ్మద్ షా సాదత్ ఆఫ్ఘనిస్థాన్ సమాచార శాఖ మంత్రిగా పనిచేసి ఇప్పుడు పిజ్జా డెలివరీ బాయ్ గా మారిపోయారు. ప్రస్తుతం జర్మనీలోని లీప్జిగ్ లో ఓ పిజ్జా తయారీ సంస్థలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నారు. ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీతో విభేదాల కారణంగా, అతను 2020 లో తన దేశాన్ని విడిచిపెట్టి జర్మనీలో స్థిరపడ్డాడు. సాదత్ 2018 లో ఆఫ్ఘన్ ప్రభుత్వంలో కమ్యూనికేషన్స్ మంత్రి అయ్యాడు. ఆఫ్ఘన్ ను తాలిబాన్ స్వాధీనం చేసుకునే ముందు 2020 లో తన పదవికి రాజీనామా చేశారు.
జర్మనీలో స్థిరపడిన తరువాత సయ్యద్ అహ్మద్ షా సాదత్ దగ్గర ఉన్న డబ్బులు కొన్ని నెలల్లో అయిపోయింది. జీవనం కోసం పిజ్జా డెలివరీ బాయ్‌గా పని చేయవలసి వచ్చింది. 2018లో అష్రఫ్ ఘనీ ప్రభుత్వంలో తాను మంత్రిగా పనిచేశానని సయ్యద్ అహ్మద్ షా సాదత్ చెప్పారు. 2020 వరకు రెండేళ్ల పాటు మంత్రిగా పనిచేశానని.. ఆ తర్వాత రాజీనామా చేసి గత ఏడాది డిసెంబర్ లో జర్మనీకి వచ్చేశానన్నారు. ప్రస్తుతం, నేను చాలా సామాన్య జీవితాన్ని గడుపుతున్నాను. నేను జర్మనీలో సురక్షితంగా ఉన్నాను. లీప్‌జిగ్‌లో నా కుటుంబంతో కలిసి ఉండటం నాకు సంతోషంగా ఉంది. నేను డబ్బు ఆదా చేసి జర్మన్ కోర్సు చేయాలని.. ఇంకా చదవాలనుకుంటున్నానని సాదత్ తెలిపారు.