గుండెపోటుతో చైనా మాజీ ప్రధాని కన్నుమూత
చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ (68) అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారని ఆ దేశ మీడియా శుక్రవారం తెలిపింది.
By అంజి Published on 27 Oct 2023 7:47 AM ISTగుండెపోటుతో చైనా మాజీ ప్రధాని కన్నుమూత
చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారని ఆ దేశ మీడియా శుక్రవారం తెలిపింది. ఆయన వయసు 68 ఏళ్ళు. "కామ్రేడ్ లీ కెకియాంగ్.. ఇటీవలి రోజుల్లో షాంఘైలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, అక్టోబరు 26న అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది'' అని మీడియా తెలిపింది. అతనిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేసిన విఫలమయ్యాయి అని అధికారులు తెలిపారు. అక్టోబర్ 27 అర్ధరాత్రి 12.10 నిమిషాలకు కెకియాంగ్ షాంఘైలో మరణించాడు అని స్టేట్ బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ రిపోర్ట్ చేసింది. లీ కెకియాంగ్ గత ఏడాది రిటైరయ్యేంత వరకు పాలక చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలో రెండవ అత్యంత శక్తిమంతమైన నేతగా కొనసాగారు.
లీ ఇంగ్లీష్ మాట్లాడే ఆర్థికవేత్త. ఆయన అధికారంలో ఉన్న సమయంలో ఆర్థిక సంస్కరణలకు మద్దతు పలికారు. మాజీ చైనా ప్రధానమంత్రి, చైనా క్యాబినెట్ అధిపతి 2013 నుండి ఒక దశాబ్దం పాటు అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ఆధ్వర్యంలో పనిచేశారు. ఈ ఏడాది మార్చిలో పదవీ విరమణ చేశారు. తూర్పు చైనాలోని పేద అన్‌హుయ్ ప్రావిన్స్‌లో ఒక చిన్న పార్టీ అధికారి కుమారుడు లీ. అతను పెకింగ్ యూనివర్శిటీ నుండి న్యాయ పట్టా పొందాడు. ఇటీవలి సంవత్సరాలలో లీ.. జిన్‌పింగ్ చేత ఎక్కువగా పక్కన పెట్టబడ్డాడు.