తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత కాబూల్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తొలి అంతర్జాతీయ విమానంగా పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం నిలిచింది. పాక్ కు చెందిన విమానం కాబూల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. విమానంలో 10 మంది వరకు ఉంటారని మీడియా సంస్థలు తెలిపాయి. వీరిలో చాలా మంది విమాన సిబ్బందే ఉండొచ్చని అభిప్రాయపడింది. ఇస్లామాబాద్ నుండి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌వేస్ (పిఐఎ) ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ఎఎఫ్‌పి జర్నలిస్ట్ మాట్లాడుతూ "విమానంలో ఎవరూ లేరు, దాదాపు 10 మంది ప్రయాణికుల కంటే ఎక్కువ మంది సిబ్బంది ఉండవచ్చు." అని చెప్పుకొచ్చారు. గత వారాంతంలో పాకిస్థాన్ ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ఆఫ్ఘనిస్తాన్ కు రెగ్యులర్ గా కమర్షియల్ విమానాలను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. చెప్పినట్టుగానే పాక్ నుంచి తొలి విమానం కాబూల్ కు చేరుకుంది.
కాబూల్ విమానాశ్రయంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలకు పలు భాగాలు చాలా వరకూ దెబ్బతిన్నాయి. ఖతార్ మరియు ఇతర దేశాల నుండి సాంకేతిక సహకారంతో తాలిబాన్లు విమానాశ్రయాన్ని పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు. దాదాపు లక్ష 20 వేల మందికి పైగా ప్రజలను అక్కడి నుండి తరలించారు. ఈ తరలింపు సమయంలో, పలు కారణాల వల్ల ఎయిర్ పోర్ట్ చాలా వరకు డ్యామేజ్ అయింది. ప్రయాణీకుల గదులు, ఎయిర్‌బ్రిడ్జిలు మరియు సాంకేతిక మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి.