కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేయడంపై భారతదేశం, పాకిస్తాన్ నేడు ఒక అవగాహనకు వచ్చాయని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఉగ్రవాదానికి ఉన్న అన్ని రూపాలు, వ్యక్తీకరణలకు వ్యతిరేకంగా భారతదేశం నిరంతరం దృఢమైన, రాజీలేని వైఖరిని కొనసాగిస్తోందని ఆయన అన్నారు.
భారతదేశం, పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ అధికారికంగా ప్రకటించారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి భూమి, గగనతలం, సముద్ర మార్గాల్లో అన్ని రకాల కాల్పులు, సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు మే12వ తేదీన మరోసారి చర్చలు జరపనున్నారని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పేర్కొన్నారు. ఈ చర్చల్లో సరిహద్దుల్లో శాంతిభద్రతల పరిరక్షణ, భవిష్యత్ కార్యాచరణపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.