నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. 13 మంది సజీవదహనం

Fire at Thai nightclub kills 13.థాయ్‌లాండ్ దేశంలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఓ నైట్ క్ల‌బ్‌లో మంట‌లు చెల‌రేగి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Aug 2022 4:57 AM GMT
నైట్‌క్లబ్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. 13 మంది సజీవదహనం

థాయ్‌లాండ్ దేశంలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఓ నైట్ క్ల‌బ్‌లో మంట‌లు చెల‌రేగి 13 మంది స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. మ‌రో 40 మందికి పైగా గాయ‌ప‌డ్డారు.

వివ‌రాల్లోకి వెళితే.. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఒంటి గంట స‌మ‌యంలో బ్యాంకాక్‌కు ద‌క్షిణంగా 150 కి.మీ దూరంలో ఉన్న చోన్‌బురి ప్రావిన్స్‌లోని సత్తాహిప్ జిల్లాలో గ‌ల మౌంటెన్‌ బీ నైట్‌స్పాట్‌లో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. పెద్ద ఎత్తున మంట‌లు ఎగిసిప‌డ్డాయి. దీంతో క్ల‌బ్‌లో ఉన్న వారు భ‌యాందోళ‌న‌కు గురైయ్యారు. కొంద‌రు బ‌య‌ట‌కు ప‌రుగులు తీయ‌గా.. మ‌రికొంద‌రు మంట‌ల్లో చిక్కుకున్నారు. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నారు. దాదాపు మూడు గంట‌ల పాటు క‌ష్ట‌ప‌డి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. అయితే.. అప్ప‌టికే క్ల‌బ్ మొత్తం కాలిపోయింది.


ఈ ఘ‌ట‌న‌లో 13 మంది మ‌ర‌ణించార‌ని.. వారిలో తొమ్మిది మంది పురుషులు, న‌లుగురు మ‌హిళ‌లు ఉన్న‌ట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు. ప్ర‌వేశ ద్వారం, బాత్రూమ్‌లో ఉన్న వారి శ‌రీరాలు గుర్తుప‌ట్ట‌లేనంగా కాలిపోయాన్నారు. మృతుల్లో ఎవ్వ‌రూ విదేశీయులు లేర‌ని, వారంతా థామ్‌లాండ్ దేశ‌స్తులేన‌ని ఓ పోలీస్ అధికారి తెలిపారు. క్ల‌బ్ గోడ‌ల‌కు ఉన్న ర‌సాయ‌నాల కార‌ణంగా మంట‌ల తీవ్ర‌త పెరిగింద‌ని, వాటిని అదుపులోకి తెచ్చేందుకు చాలా స‌మ‌యం ప‌ట్టింద‌న్నారు.

ఈఘ‌ట‌న‌కు సంబంధించిన ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఆ వీడియోలో కొంద‌రు మంట‌లు అంటుకోని క్ల‌బ్ నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు పెడుతున్న‌ట్లు దృశ్యాలు క‌నిపించాయి.

Next Story