74% వీసా దరఖాస్తులు తిరస్కరణ.. ఆ దేశంలో చదువుకోవాలని కలలు కంటే కష్టమే..!
కెనడాలో చదువుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థుల కలలు ఇకపై నెరవేరేలా లేవు.
By - Medi Samrat |
కెనడాలో చదువుకోవాలని కలలు కంటున్న భారతీయ విద్యార్థుల కలలు ఇకపై నెరవేరేలా లేవు. ప్రభుత్వ డేటా ప్రకారం.. కెనడా విదేశీ విద్యార్థులకు వీసాలపై పరిమితులను కఠినతరం చేసింది. ఈ ప్రభావం భారతీయ విద్యార్థులపై భారీగా పడింది.
2025 నుండి కెనడా అంతర్జాతీయ విద్యార్థుల కోసం వరుసగా రెండవ సంవత్సరం అనుమతుల సంఖ్యను తగ్గించింది. తాత్కాలిక వలసదారుల సంఖ్యను తగ్గించడానికి, వీసా మోసాలను అరికట్టడానికి ఈ చర్య తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
భారతీయ విద్యార్థుల నుండి వచ్చిన దాదాపు 74% వీసా దరఖాస్తులు ఆగస్టు 2025లో తిరస్కరించబడ్డాయి. ఆగస్టు 2023లో ఈ సంఖ్య 32%గా ఉంది. దీనితో పోల్చి చూస్తే.. మొత్తం విదేశీ విద్యార్థుల దరఖాస్తుల్లో 40%.. చైనీస్ విద్యార్థుల దరఖాస్తుల్లో 24% తిరస్కరించబడ్డాయి. మరోవైపు భారతీయ దరఖాస్తుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ఆగస్టు 2023లో 20 వేల 900 ఉండగా, 2025 ఆగస్టులో 4,515 మాత్రమే. గత దశాబ్ద కాలంగా కెనడాకు వెళ్లే విదేశీ విద్యార్థుల సంఖ్య భారత్‌లోనే ఎక్కువగా ఉంది. అదే భారత్ ఇప్పుడు అత్యధిక వీసా తిరస్కరణలను ఎదుర్కొంటోంది.
కెనడియన్ ప్రభుత్వం ప్రకారం.. 2023లో 1,550 నకిలీ వీసా దరఖాస్తులు గుర్తించబడ్డాయి. అవి ఎక్కువగా భారతదేశం నుండే.. ఇప్పుడు ప్రభుత్వం వెరిఫికేషన్ వ్యవస్థను మరింత పటిష్టం చేయడంతో గతేడాది 14 వేలకు పైగా అనుమానాస్పద పత్రాలు పట్టుబడ్డాయి. దీనితో పాటు.. విదేశీ విద్యార్థుల కోసం ఫైనాన్షియల్ సర్టిఫికేట్, ఇతర వెరిఫికేషన్ విధానాలను కూడా కఠినతరం చేశారు. వీసాలు మంజూరు చేయడం కెనడా ఏకైక హక్కు అని భారత్‌లోని కెనడియన్ ఎంబసీ పేర్కొంది.. అయితే కెనడియన్ విద్యాసంస్థలకు భారతీయ విద్యార్థులు ఎల్లప్పుడూ నాణ్యమైన అభ్యర్ధులు అని కూడా భారతదేశం గుర్తు చేసింది.
అనేక కెనడా విశ్వవిద్యాలయాలలో భారతీయ విద్యార్థుల సంఖ్య వేగంగా తగ్గింది. యూనివర్సిటీ ఆఫ్ వాటర్‌లూలో భారతీయ విద్యార్థుల సంఖ్య గత మూడు-నాలుగేళ్లలో మూడింట రెండు వంతులు తగ్గింది. అదేవిధంగా, యూనివర్శిటీ ఆఫ్ రెజీనా, సస్కట్చేవాన్ విశ్వవిద్యాలయాలు కూడా క్షీణతను నమోదు చేశాయి.