ట్రంప్ ఇంటిపై ఎఫ్‌బీఐ దాడులు.. ఆ రహస్య పత్రాల కోసమేనా.?
FBI raid on Donald Trumps house in USA. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తనిఖీలు చేపట్టింది. విలాసవంతమైన ఫామ్
By అంజి Published on 9 Aug 2022 11:47 AM ISTఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ తనిఖీలు చేపట్టింది. విలాసవంతమైన ఫామ్ హౌస్, రిసార్ట్ మార్ - ఎ - లిగోలో సోదాలు చేసింది. ట్రంప్ ఇంటిని దర్యాప్తు ఏజెన్సీ ఏజెంట్లు చుట్టుముట్టారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎఫ్‌బీఐ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కాగా దీనిపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. మార్ - ఎ - లిగోలోని ఫామ్ బీచ్‌లోని తన నివాసాన్ని ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుందన్నారు. ఇందుకు కారణాలను మాత్రం ఆయన వెల్లడించారు.
తనిఖీలపై ఎఫ్‌బీఐ ప్రతినిధిని జర్నలిస్టులు సంప్రదించగా.. సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. ఈ తనిఖీలు రాజకీయ ప్రతీకారమేనని ట్రంప్ ఆరోపణలు చేశారు. మాజీ అధ్యక్షుడు ఇంటిపై ఎఫ్‌బీఐ దాడి చేయడం అమెరికాకు గడ్డు కాలమన్నారు. అమెరికాలో గతంలో ఎప్పుడూ ఏ మాజీ అధ్యక్షుడికి ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థకు సహకారం అందిస్తున్నప్పటికీ, కనీసం సమాచారం ఇవ్వకుండా తన ఇంటిపై దాడి చేశారని ట్రంప్ ఆరోపించారు.
2024 ఎన్నికల్లో పోటీ చేయకుండా తనను ఆపాలని కోరుకునే కరుడుగట్టిన డెమొక్రాట్ల దాడి ఇది అని ట్రంప్ విమర్శించారు. అయితే, ఎఫ్‌బీఐ దాడుల సమయంలో ట్రంప్ ఇంట్లో లేడని, ప్రస్తుతం ఆయన న్యూజెర్సీలో ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా ట్రంప్ వైట్ హౌస్ నుంచి ఫ్లోరిడా క్లబ్‌కు తీసుకువచ్చిన పత్రాల పెట్టెలపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందని ఇద్దరు అధికారులు చెప్పారు. ఆ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ఎఫ్‌బీఐ సెర్చ్ వారెంట్‌ని జారీ చేసిందని యూఎస్ అధికారులు చెప్పారు. ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడా ఇంటి నుంచి 15 బాక్స్‌ల వైట్ హౌస్ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.