అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) కు చెందిన "టెన్ మోస్ట్ వాంటెడ్ ఫ్యుజిటివ్స్"లో ఒకరైన సిండీ రోడ్రిగ్జ్ సింగ్‌ను భారత్ లో అరెస్టు చేశారు. సిండీ రోడ్రిగ్జ్ సింగ్ 2022లో తన 6 ఏళ్ల కుమారుడు నోయెల్ రోడ్రిగ్జ్ అల్వారెజ్ హత్య కేసులో వాంటెడ్‌గా ఉంది. తన బిడ్డ హత్యకు సంబంధించిన ఆరోపణలపై విచారణ నుండి తప్పించుకోవడానికి ఆమె మార్చి 2023లో అమెరికా నుండి పారిపోయిందని ఆరోపణలు ఉన్నాయి.
ఆమె భారత సంతతికి చెందిన భర్త అర్ష్‌దీప్ సింగ్, ఆరుగురు పిల్లలతో కలిసి, మార్చి 22, 2023న భారతదేశానికి వెళ్తున్న విమానంలో చివరిసారిగా కనిపించారు. ఆమె కుమారుడు తప్పిపోయినట్లు అధికారికంగా నివేదించబడిన కొన్ని రోజుల తర్వాత ఈ ఘటన జరిగింది. సిండీ సింగ్ ప్రాసిక్యూషన్‌ను నివారించడానికి చట్టవిరుద్ధంగా పారిపోయిందని అమెరికా అధికారులు తెలిపారు. అక్టోబర్ 2024లో, ఇంటర్‌పోల్ ఆమెపై రెడ్ నోటీసు జారీ చేసింది. ఫెడరల్ దర్యాప్తు సంస్థ ఆమెను అరెస్టు చేయడానికి దారితీసిన సమాచారం కోసం రివార్డ్‌ను $25,000 నుండి $250,000కి పెంచడంతో ఆమె పేరును ఈ సంవత్సరం జూలైలో FBI యొక్క "మోస్ట్ వాంటెడ్" జాబితాలో చేర్చారు.
ఆమెను భారత అధికారులు, ఇంటర్‌పోల్ సమన్వయంతో FBI అధికారులు భారతదేశంలో అరెస్టు చేసి అమెరికాకు తరలించారు. ఆమెను టెక్సాస్ అధికారులకు అప్పగించనున్నట్లు ఫాక్స్ న్యూస్ నివేదిక తెలిపింది.