ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. 36 మంది సజీవదహనం
Factory fire kills 36 in Chinese city of Anyang.చైనా దేశంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
By తోట వంశీ కుమార్
చైనా దేశంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 36 మంది సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సెంట్రల్ చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ సిటీలోని' కైక్సిండా ట్రేడింగ్ కో లిమిటెడ్' కంపెనీలో సోమవారం సాయంత్రం 4.22 గంటలకు అగ్నిప్రమాదం సంభవించినట్లు రెస్క్యూ బృందాలకు సమాచారం అందింది. ప్రజా భద్రత, అత్యవసర ప్రతిస్పందన, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు విద్యుత్ సరఫరా యూనిట్లు, అత్యవసర నిర్వహణ బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నాయి.
మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుండడంతో ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమించారు. దాదాపు ఆరు గంటల పాటు శ్రమించి 11 గంటల సమయంలో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం వరకు 36 మంది మరణించినట్లు, మరో ఇద్దరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియడం లేదు.
కాగా.. అగ్నిప్రమాదానికి ఇంకా కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
బలహీనమైన భద్రతా ప్రమాణాలు, అధికారుల అవినీతి కారణంగా చైనాలో పారిశ్రామిక ప్రమాదాలు సర్వసాధారణం. జూన్‌లో షాంఘైలోని రసాయన కర్మాగారంలో జరిగిన పేలుడులో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. గతేడాది సెంట్రల్ సిటీ షియాన్‌లో గ్యాస్ పేలుడు సంభవించడంతో 25 మంది మరణించగా అనేక బిల్డింగ్‌లు శిథిలావస్థకు చేరుకున్నాయి.