అఫ్ఘనిస్థాన్ లో కాబూల్ విమానాశ్రయం వద్ద ఉగ్రవాద దాడి జరిగే ప్రమాదముందని అమెరికా సహా వివిధ దేశాలు హెచ్చరించిన నేఫథ్యంలో ఆ హెచ్చరికలు నిజమయ్యాయి. గురువారం కాబూల్ విమానాశ్రయం గేటు వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది మరణించినట్లు తెలుస్తోంది. తమ దేశ పౌరులతో పాటు ఆఫ్ఘన్లు కూడా కాబూల్ విమానాశ్రయ పరిసరాలకు రావొద్దని అమెరికా ఈ ఉదయమే హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే ఈ పేలుడు ఘటన చోటుచేసుకోవడం సంచలనం కలిగించింది. ఈ ఘటనలో అమెరికా భద్రతా బలగాలకు చెందిన ముగ్గురు సైతం గాయపడినట్లు సమాచారం
పేలుడు జరిగిన గేటు వద్ద పెద్ద సంఖ్యలో అఫ్ఘనిస్థాన్ పౌరులు ఉన్నారు. ఇది ఆత్మాహుతి దాడేనని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాబూల్ విమానాశ్రయానికి సమీపంలోని మరో హోటల్ వద్ద కూడా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు ఘటనతో విమనాశ్రయ పరిసర ప్రాంతాల్లో గంభీర వాతావరణం నెలకొంది. రక్తమోడుతూ ప్రాణాలు రక్షించుకోవడానికి ఆసుపత్రికి క్షతగాత్రులు పరుగులు పెడుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి. పేలుడు ఘటనపై రక్షణశాఖ వర్గాలు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు సమాచారం అందించాయి.