అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఉన్న గాఢమైన వ్యక్తిగత స్నేహం ఇప్పుడు ముగిసిందని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ సంచలన ప్రకటన చేశారు. ట్రంప్‌తో సత్సంబంధాలు ప్రపంచ నేతలను ఆయన విధానాల దుష్ప్రభావాల నుంచి రక్షించలేవని బోల్టన్ హెచ్చరించారు. భారతదేశం, అమెరికా మధ్య సంబంధాలు గత రెండు దశాబ్దాలలో కనిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది.
ట్రంప్ టారిఫ్ విధానం, భారతదేశంపై ఆయన అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న నిరంతర విమర్శలు ఈ సంబంధాన్ని మరింత బలహీనపరిచాయి. బ్రిటీష్ మీడియా పోర్టల్ ఎల్‌బిసికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ మాట్లాడుతూ.. ట్రంప్ అంతర్జాతీయ సంబంధాలను నాయకులతో తన వ్యక్తిగత స్నేహం యొక్క ప్రిజం ద్వారా మాత్రమే చూస్తారని అన్నారు.
ఉదాహరణకు వ్లాదిమిర్ పుతిన్‌తో ఆయనకు మంచి స్నేహం ఉంటే.. అమెరికా, రష్యాలకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన భావిస్తారు. కానీ వాస్తవం దీనికి భిన్నంగా ఉంది. సరిగ్గా అదే పరిస్థితి భారత్‌కు ఎదురైంది. ట్రంప్, మోదీల మధ్య స్నేహం అంతకుముందు బలంగా ఉంది.. కానీ ఇప్పుడు అది ముగిసింది.
ట్రంప్ పాలనా విధానాలు భారత్-అమెరికా సంబంధాలను దశాబ్దాలు వెనక్కి నెట్టాయని బోల్టన్ అన్నారు. ముఖ్యంగా రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్‌పై విధించిన సుంకాలు న్యూఢిల్లీని రష్యా, చైనాలకు దగ్గర చేశాయి. ఇది ట్రంప్ చేసిన పెద్ద తప్పిదమని బోల్టన్ పేర్కొన్నాడు. రష్యా వైపు మొగ్గు చూపుతున్న భారత్‌ను వెనక్కి నెట్టేందుకు అమెరికా ఎన్నో ఏళ్లుగా ప్రయత్నించిందని, చైనాను అమెరికా తన అతిపెద్ద భద్రతా సవాలుగా పరిగణించాలని ఆయన అన్నారు. అమెరికా, ట్రంప్‌లకు ప్రత్యామ్నాయంగా తనను తాను ప్రదర్శించుకునే అవకాశాన్ని చైనా సద్వినియోగం చేసుకున్నదని కూడా ఆయన అన్నారు. ఈ పరిస్థితిని మార్చవచ్చు.. కానీ ప్రస్తుతం ఇది భారతదేశం-యుఎస్ సంబంధాలకు చాలా చెడ్డ సమయం. ట్రంప్ విధానాలు భారత్‌ను రష్యా, చైనాలకు దగ్గరి దారిలోకి నెట్టాయన్నారు.