కరోనా వ్యాక్సిన్ విషయంలో పెద్ద రేస్ జరుగుతూ ఉంది. అత్యవసర అనుమతులు చాలా వ్యాక్సిన్లకు ఇస్తూ ఉన్నారు. ఆక్స్ ఫర్డ్ టీకా కాస్త ఈ విషయంలో వెనుకబడ్డట్టు కనిపిస్తోంది. తాజాగా కూడా యూరోపియన్ మెడిసిన్స్ ఏజన్సీ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనికా సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ కు తక్షణం అనుమతించే అవకాశాలు లేవని తెలిపింది. ఈ వ్యాక్సిన్ పై ఇంకా పూర్తి సమాచారం తమకు చేరలేదని ఈఎంఏ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నోయల్ వాటియన్ తెలిపారు. ఇప్పటివరకూ ఆ సంస్థ తమ వ్యాక్సిన్ కు అనుమతించాలని దరఖాస్తు కూడా చేసుకోలేదని అన్నారు. వ్యాక్సిన్ పై మరింత సమాచారం అందాల్సి వుందని, ఆ తరువాతే తాము ఓ నిర్ణయానికి రాగలమని అన్నారు నోయల్ వాటియన్. ఇందుకు కనీసం మరో నెల రోజుల సమయం పట్టవచ్చని అంటున్నారాయన.
ఆస్ట్రాజెనికా చీఫ్ పాస్కల్ ఇటీవల మాట్లాడుతూ తమ వ్యాక్సిన్ కరోనా నుంచి 100 శాతం రక్షణ కల్పిస్తుందని తెలిపారు. కొత్త వైరస్ స్ట్రెయిన్ నుంచి కూడా ఇది రక్షిస్తుందని ఆయన అన్నారు. బ్రిటీష్ ఔషధ నియంత్రణ సంస్థలకు ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ట్రయల్స్ కు సంబంధించిన సమాచారం చేరింది.