క‌రోనాకు బ‌లైన దేశాధినేత.. షాకింగ్

Eswatini PM Ambrose Dlamini dies of COVID-19. క‌రోనా బారిన ప‌డిన ఎంద‌రో దేశాధినేత‌లు చావు వ‌ర‌కు వెళ్లి మ‌ళ్లీ

By Medi Samrat  Published on  15 Dec 2020 8:06 AM GMT
క‌రోనాకు బ‌లైన దేశాధినేత.. షాకింగ్

క‌రోనా బారిన ప‌డిన ఎంద‌రో దేశాధినేత‌లు చావు వ‌ర‌కు వెళ్లి మ‌ళ్లీ కోలుకున్నారు. కానీ ఒక్క ఆ దేశం మాత్రం క‌రోనా సెకండ్ వేవ్‌లో త‌మ ప్ర‌ధానిని కోల్పోయి శోక‌సంద్రంలో మునిగిపోయింది. ఆ దేశ‌మే ఎస్వాటినీ. దీనికి మ‌రో పేరు స్వాజిలాండ్‌. ఎస్వాటినీ ప్ర‌ధాన‌మంత్రి ఆంబ్రోస్ మాండ్‌వులో లామినీ (52) క‌రోనాతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా మ‌ర‌ణించిన తొలి ప్ర‌పంచ స్థాయి నేత ఆంబ్రోస్ మాండ్‌వులో కావ‌డం గ‌మ‌నార్హం.

రెండు వారాలు మృత్యువుతో పోరాడి..

ఆంబ్రోస్ మాండ్‌వులో న‌వంబ‌ర్ నెల మ‌ధ్య‌లో కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధార‌ణ‌యింది. అయితే త‌న బాగానే ఉన్నాన‌ని, కోవిడ్‌కు సంబంధించి ఎలాంటి ల‌క్ష‌ణాలు లేవ‌ని ఆయ‌న అధికారికంగా ప్ర‌క‌టించారు. ఆంబ్రోస్ ఆ ప్ర‌క‌ట‌న చేసిన కొన్ని రోజుల‌కే ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థ‌తి స‌క్ర‌మంగా లేక‌పోవ‌డంతో మెరుగైన చికిత్స కోసం ప‌క్క‌నే ఉన్న సౌతాఫ్రికా దేశానికి తీసుకెళ్లారు. రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడిన ఆయ‌న సౌత్ ఆఫ్రికాలోని ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ సోమ‌వారం మ‌ధ్యాహ్నం తుదిశ్వాస విడిచిన‌ట్లు స్వాజిలాండ్ ఉప ప్ర‌ధాని థెంబా మాసుకు అధికారికంగా ప్ర‌క‌టించారు. 1968వ సంవ‌త్స‌రంలో జ‌న్మించిన ఆంబ్రోస్ 2018లో స్వాజిలాండ్ దేశ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. స్వాజిలాండ్ దేశ చ‌రిత్ర‌లోనే అత్యంత చిన్న వ‌య‌స్సు ప్ర‌ధాన‌మంత్రిగా ఆంబ్రోస్ మాండ్‌వులో చ‌రిత్ర సృష్టించి మెరుగైన పాల‌న అందించారు.


Next Story