ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెక్నాలజీ రంగంలో అతడు దూసుకుపోతూ ఉన్నాడు. ఇటీవలే ట్విట్టర్ ను కూడా కొనుగోలు చేయడంతో వార్తల్లో నిలిచారు. తాజాగా అతడు తన చావు గురించి ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో మస్క్ రష్యాను తప్పుబడుతూనే ఉన్నారు. అంతేకాకుండా ఉక్రెయిన్ కు టెక్ పరమైన సహాయాన్ని కూడా అందిస్తూ వస్తున్నాడు. అలాంటి మస్క్ తాజాగా తాను అనుమానాస్పద మరణానికి గురవుతానేమోననే భయాన్ని వ్యక్తం చేశారు.
'నేను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే.. మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషం.' (If I die under mysterious circumstances, it's been nice knowin ya) అని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఆ ట్వీట్‌కు కొంత సమయం ముందు.. 'ఉక్రెయిన్‌లోకి ఫాసిస్ట్ దళాలతో పాటు కమ్యూనికేషన్ సామగ్రిని పంపించటంలో మీ భాగస్వామ్యం ఉంది. దీనికి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది.' అని రష్యన్ అధికారి పంపిన సందేశాన్ని మస్క్ షేర్ చేశారు. ఈ నేపథ్యంలో తన మరణంపై మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తమకు వ్యతిరేకంగా పని చేసిన వారిని రష్యా అంతం చేసిన సందర్భాలకు సంబంధించిన చాలా థియరీలు ఉన్నాయి.