అపర కుబేరుడు, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్.. భారత ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. భారతదేశంతో కలిసి పని చేయడం కోసం ఎదురుచూస్తున్నట్లు మస్క్ తెలిపారు. "ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికలలో మీ విజయానికి అభినందనలు నరేంద్ర మోదీ! భారతదేశంలో నా కంపెనీలు ఉత్తేజకరమైన పని చేస్తాయని ఎదురు చూస్తున్నాను" అని మస్క్ X లో పోస్టు పెట్టారు.
నరేంద్ర మోదీ ఈ ఆదివారం వరుసగా మూడవసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన నాయకత్వంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) లోక్‌సభలోని 543 స్థానాలకు గాను 293 స్థానాలను గెలుచుకుంది. ఎన్నికలకు ముందు, మస్క్ తన భారత పర్యటనను ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. గతేడాది జూన్‌లో మస్క్, ప్రధాని మోదీ అమెరికాలో చర్చలు జరిపారు. సమావేశం తరువాత, మస్క్ తనను తాను "మోదీ అభిమాని" అని చెప్పుకొచ్చారు. ఇక టెస్లా భారతదేశంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు హామీ ఇచ్చాడు మస్క్.