ఇండోనేషియా ఏప్రిల్ 28 నుండి పామాయిల్ ఎగుమతులను నిషేధిస్తున్నట్లు తెలిపింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఇప్పటికే సన్ ఫ్లవర్ ఆయిల్ ధరలు పెరగగా.. ఇప్పుడు పామాయిల్ ధరలు కూడా పెరగబోతున్నాయని తెలుస్తోంది. దేశీయ కొరతను తగ్గించడానికి, ఆ దేశంలో ధరలను తగ్గించడానికి ఎడిబుల్ ఆయిల్, దాని ముడి పదార్థాల ఎగుమతులపై పరిమితులు విధించాలని ఇండోనేషియా నిర్ణయించింది. ఇండోనేషియా తీసుకున్న ఈ నిర్ణయంతో రానున్న రోజుల్లో ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చని ఆర్థిక నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో శుక్రవారం ఎడిబుల్ ఆయిల్, ముడి పదార్థాల ఎగుమతిపై నిషేధాన్ని ప్రకటించారు. ఏప్రిల్ 28 నుంచి పామాయిల్, ముడిసరుకు ఎగుమతులను నిరవధికంగా నిషేధించాలని ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయించింది.
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార చమురు దిగుమతిదారు. ప్రపంచంలో ఎక్కువ భాగం పామాయిల్ ఆహారం కోసం ఉపయోగిస్తున్న దేశం భారత్ కావడంతో ఇండోనేషియా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తరువాత ఈ సంవత్సరం గ్లోబల్ గా వంట నూనె ధరలు పెరిగాయి. యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇతర దేశాలకు వెళ్లడం లేదు. ప్రపంచంలో ఎగుమతి అవుతున్న సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో 76 శాతం నల్ల సముద్రం గుండా వెళుతోంది. ఇండోనేషియా నుంచి సరఫరా నిలిచిపోవడం వల్ల భారతదేశానికి ప్రతి నెలా దాదాపు 4 మిలియన్ టన్నుల పామాయిల్ నష్టం వాటిల్లుతుంది. ఇవన్నీ చూస్తుంటే దేశంలో పామాయిల్ ధర కూడా పెరగడం పక్కాగా కనిపిస్తోంది.