దుబాయ్ లో ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్లకు కొన్ని కోట్లు వెచ్చిస్తూ ఉంటారనే విషయం చాలా మందికి తెలిసిందే. ఆ నెంబర్ ప్లేట్ లకు పెట్టే డబ్బులకు ఏకంగా లగ్జరీ కార్లను కొనేయొచ్చు. తాజాగా ‘AA 16’ అనే నెంబర్ ప్లేట్ ను భారీ ధరకు వేలంపాటలో కొనుక్కున్నారు. మే 20, సోమవారం జరిగిన 115వ బహిరంగ వేలంలో దుబాయ్‌లోని ‘AA 16’ అనే వాహన నెంబర్ ప్లేట్ ను దిర్హామ్ 7.32 మిలియన్లకు విక్రయించారు. అంటే భారత కరెన్సీలో 16,59,97,185 రూపాయలు. 16 కోట్ల రూపాయలకు ఎలాంటి కార్లు వస్తాయో మీ ఊహకే వదిలేస్తున్నాం.
హిల్టన్ దుబాయ్ అల్ హబ్తూర్ సిటీ హోటల్‌లో వేలంపాట నిర్వహించారు. RTA వేలంలో 90 ఫ్యాన్సీ ప్లేట్‌లను ఉంచారు. AA-I-J-L-M-N-O-P-R-S-T-U-V-W-X-Y-Z సిరీస్ నెంబర్ ప్లేట్ లకు వేలంపాట నిర్వహించారు. AA 16 — దిర్హామ్ 7.32 మిలియన్ (రూ. 16,59,97,185) టాపర్ గా నిలవగా.. తర్వాతి స్థానంలో AA 69 — దిర్హామ్ 6 మిలియన్లు (రూ. 13,60,52,567) నిలిచింది. ఇక AA 999 కోసం దిర్హామ్ 4.50 మిలియన్ (రూ. 10,20,39,425) ఖర్చు చేశారు. 2016లో, భారతీయ వ్యాపారవేత్త బల్విందర్ సాహ్ని 'D5' నెంబర్ ప్లేట్ కోసం ఏకంగా దిర్హామ్ 33 మిలియన్లను చెల్లించాడు. ఇది ఆల్ టైమ్ రికార్డుగా చెప్పొచ్చు.