మాయ, బాబీ, రూబిలను తీసుకొచ్చేసిన భారత్

Deployed at India’s embassy in Kabul, 3 dogs brought back home. ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు రోజు రోజుకీ మారిపోతున్న సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  20 Aug 2021 3:22 PM IST
మాయ, బాబీ, రూబిలను తీసుకొచ్చేసిన భారత్

ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితులు రోజు రోజుకీ మారిపోతున్న సంగతి తెలిసిందే..! ఇప్పటికే చాలా దేశాలు అక్కడి కార్యాలయాలను ఖాళీ చేసేశాయి. భారత్ కూడా పెద్ద సిబ్బందిని, భారతీయులను అక్కడి నుండి తీసుకుని వచ్చేస్తూ ఉంది. పెద్ద ఎత్తున రెస్క్యూ కార్యక్రమాలను భారత ప్రభుత్వం కూడా చేపట్టింది. భారత్ తీసుకుని వచ్చిన వారిలో మాయ, బాబీ, రూబిలు కూడా ఉన్నారు. వీరు చాలా ప్రత్యేకమైన వారు. వీళ్లు ఎవరనే కదా..!

ఆఫ్ఘనిస్తాన్లో మూడేళ్ల పాటు సేవలందించిన మూడు శునకాలు. ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ (ఐటీబీపీ)కి చెందిన కే9 జాగిలాలు - మాయ, బాబీ, రూబిలను 2019లో కాబూల్ పంపించారు. వీటికి హర్యానాలోని ఎన్‌టీడీసీ భాను శునక శిక్షణా కేంద్రంలో ట్రైనింగ్ ఇచ్చారు. ఇది దేశంలోని అత్యుత్తమ శునక శిక్షణా కేంద్రాల్లో ఒకటి. ఆఫ్ఘనిస్తాన్ లో పరిస్థితుల కారణంగా భారత్ కు వీటిని తీసుకుని వచ్చేశారు అధికారులు. భారత వాయుసేకు చెందిన సీ-17 ఎయిర్‌క్రాప్ట్‌లో ఈ శునకాలను కాబూల్ నుంచి గుజరాత్ తీసుకొచ్చారు. ఇక్కడి జామ్ నగర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఆ విమానం ల్యాండయింది. బుధవారం ఈ శునకాలు ఢిల్లీలోని ఐటీబీపీ చావాలా క్యాంపుకు చేరుకున్నాయి.

మూడేళ్ల పాటు భారత రాయబార కార్యాలయంలో అధికారులతోపాటు, అక్కడ పనిచేసే ఆఫ్ఘన్ పౌరులకు ఇవి రక్షణ కల్పించాయి. ఆఫ్ఘనిస్తాన్‌లోని భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న 120 మందిని సైనిక రవాణా విమానంలో భారత ప్రభుత్వం తరలించింది. ఈ విమానం హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో బయలుదేరి గుజరాత్‌లోని జామ్‌నగర్ ఎయిర్‌బేస్‌లో ల్యాండ్ అయింది. విమానంలో తరలించిన వ్యక్తుల్లో కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులు, భద్రతా సిబ్బంది, మరికొంత మంది భారతీయులు ఉన్నారు.


Next Story