ఆప్ఘానిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమణ చేసుకున్నాక.. ఎన్నో ఊహించని పరిణామాల అనంతరం అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత.. తమ పాలన గతంలో లాగా ఉండదని చెప్పుకుంటూ వచ్చింది. అయితే అక్కడ పరిస్థితులు మాత్రం ఇందుకు విభిన్నంగా కనిపిస్తున్నాయి. తాజాగా ఓ తాలిబన్ నాయకుడు చేసిన ప్రకటనే ఇందుకు సాక్ష్యం. గతంలో అమలు చేసిన శిక్షలను మళ్లీ ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రిజన్స్ ఇంచార్జీ నేత ముల్లా నూదుద్దిన్ తురాబి అన్నారు.
తప్పు చేసిన వారి కాళ్లు, చేతుల్ని నరికివేయడం లాంటి శిక్షలను మళ్లీ అమలు చేస్తామన్నారు. అయితే ఈ శిక్షలను గతంలో లాగా బహిరంగంగా వేయమన్న ఆయన దీనిపై కేబినెట్ అధ్యయనం చేస్తోందన్నారు. దేశంలో షరియా చట్టాలను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే తమ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలను తలదూర్చాల్సిన పని లేదన్నారు. తమ పాలన ఎలా ఉండాలనేది ఇతర దేశాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఆప్ఘాన్‌లో మానవహక్కుల ఉల్లంఘన కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మహిళలపై ఆంక్షలు, విద్యార్థుల పాఠశాలలపై తాలిబన్లు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు.
కాగా ఇటీవల యూఎన్‌ఓ సర్వసభ్య సమావేశంలో ప్రసంగించేందుకు తమకు అనుమతి ఇవ్వాలని ఆప్ఘాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ లేఖ రాసిన విషయం తెలిసిందే. సుహైల్ షహీను యూఎన్‌ఓ రాయబారిగా తాలిబన్ ప్రభుత్వం నామినేట్ చేసింది. అయితే ఇప్పటికి ఎక్కువ మొత్తంలో ప్రపంచ దేశాలు ఆప్ఘాన్‌లో ఏర్పడ్డ తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించలేదు.